Diesel SUVs : బడ్జెట్‌లో బెస్ట్ పవర్.. రూ.10 లక్షలలోపు భారతదేశంలోని 5 అత్యంత చవకైన డీజిల్ ఎస్‌యూవీలు
రూ.10 లక్షలలోపు భారతదేశంలోని 5 అత్యంత చవకైన డీజిల్ ఎస్‌యూవీలు
Diesel SUVs : మారుతున్న నిబంధనలు, పర్యావరణపరమైన ఒత్తిడి కారణంగా దేశంలో డీజిల్ కార్ల అమ్మకాలు నెమ్మదిగా తగ్గుతున్నప్పటికీ, ఎక్కువ పవర్, టార్క్, మెరుగైన ఇంధన సామర్థ్యం కోరుకునే కొనుగోలుదారులు ఇప్పటికీ డీజిల్ వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఈ డిమాండ్ కొనసాగుతోంది. పెద్ద కార్ల తయారీ సంస్థలు డీజిల్ ఇంజిన్ల ఉత్పత్తిని ఆపేస్తున్నా, మహీంద్రా, టాటా మోటార్స్ వంటి సంస్థలు ఇప్పటికీ రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో పవర్ఫుల్ డీజిల్ ఎస్‌యూవీలను భారత మార్కెట్‌లో విక్రయిస్తున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే భారతదేశంలోని 5 అత్యంత చవకైన డీజిల్ ఎస్‌యూవీల వివరాలు తెలుసుకుందాం.
మహీంద్రా బొలెరో
బొలెరో ప్రస్తుతం భారతదేశంలో అత్యంత చవకైన డీజిల్ ఎస్‌యూవీ. ఈ మోడల్‌ను మహీంద్రా సంస్థ ఇటీవల కొన్ని డిజైన్ మార్పులు, కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. ఇందులో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడి, వెనుక చక్రాలకు పవర్ అందిస్తుంది. దీని ధర రూ.7.99 లక్షలు.
మహీంద్రా బొలెరో నియో
బొలెరో నియో అనేది సాధారణ బొలెరోకు కొంచెం ప్రీమియం వెర్షన్. దీనికి కూడా డిజైన్‌లో కొత్తదనం, క్యాబిన్ లోపల కొత్త ఫీచర్లు జోడించారు. బొలెరో నియోలో సాధారణ బొలెరో మాదిరిగానే ఇంజిన్ ఉన్నప్పటికీ, ఇది మరింత ఎక్కువ పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ.8.49 లక్షలు.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ
మహీంద్రా నుండి వచ్చిన కొత్త ఎస్‌యూవీ ఇది. ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ దేశంలో అత్యధిక ఫీచర్లు ఉన్న సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటిగా నిలిచింది. ఈ మోడల్‌లో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఏఎంటి (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధర రూ.8.95 లక్షలు.
కియా సోనెట్
కియా సోనెట్ కూడా అనేక ఫీచర్లతో కూడిన చవకైన సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ. భారతదేశంలో కియా సంస్థ ఎదుగుదలకు ఈ మోడల్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇందులో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ ఆప్షన్లలో వస్తుంది. దీని ధర రూ.8.98 లక్షలు.
టాటా నెక్సాన్
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో నెక్సాన్ ఒకటి. ఈ జాబితాలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ కూడా ఇదే. ఈ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ డీజిల్ వేరియంట్‌లో 1.5-లీటర్ ఇంజిన్ ఉంటుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్ యూనిట్, 6-స్పీడ్ ఏఎంటి (ఆటోమేటిక్) ఉన్నాయి. దీని ధర రూ.9.01 లక్షలు.