Electric Vehicles : ఇరాన్ వార్ ఎఫెక్ట్.. ఆకాశాన్ని తాకనున్న ఇంధన ధరలు.. ఈవీలే ఏకైక మార్గమా?
ఈవీలే ఏకైక మార్గమా?
Electric Vehicles : ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు సామాన్యుడి వాహన కొనుగోలు నిర్ణయాలను కూడా శాసిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు ఇంధన ధరలపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులు ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. 2026లో కారు కొనాలనుకునే వారికి ఈ యుద్ధ సెగ ఒక కొత్త ఆలోచనను రేకెత్తిస్తోంది. అసలు ఎలక్ట్రిక్ కార్లకు ఎందుకు ఇంత డిమాండ్ పెరుగుతోంది? ప్రస్తుత పరిస్థితుల్లో ఈవీ కొనడం లాభమేనా? అన్న పూర్తి వివరాలు చూద్దాం.
ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ ఎందుకు పెరుగుతోంది?
పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఎప్పుడు పెరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో 20 శాతం హార్ముజ్ జలసంధి గుండానే వెళ్తుంది. అక్కడ ఉద్రిక్తతలు పెరగడంతో చమురు రవాణాకు ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ అస్థిరతను గమనించిన భారతీయ కస్టమర్లు ముందస్తు జాగ్రత్తగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నారు. వాహన పోర్టల్ గణాంకాల ప్రకారం, ఫిబ్రవరిలో 3.5 శాతంగా ఉన్న ఈవీల వాటా మార్చి నాటికి 5.1 శాతానికి పెరగడం విశేషం.
రేసులో నిలిచిన టాప్ కంపెనీలు
మార్చి 2026 గణాంకాల ప్రకారం.. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా మోటార్స్ 37 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత స్థానాల్లో మహీంద్రా & మహీంద్రా, JSW ఎంజీ మోటార్ ఇండియా నిలిచాయి. ముఖ్యంగా ఎంజీ విండ్సర్ ఈవీ అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా రికార్డు సృష్టించింది. మారుతి సుజుకి కూడా ఈవీ రంగంలోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా, ఏకంగా 325 శాతం వృద్ధితో దూసుకుపోతోంది. అంటే చిన్న కంపెనీల నుంచి దిగ్గజాల వరకు అందరూ ఇప్పుడు బ్యాటరీ పవర్‌పైనే దృష్టి పెట్టారు.
ఎలక్ట్రిక్ కార్ల ఆర్థిక లాభాలు
పెట్రోల్ కారును కిలోమీటరు నడపాలంటే ప్రస్తుతం రూ.7 నుంచి రూ.9 వరకు ఖర్చవుతుంది. అదే ఎలక్ట్రిక్ కారును ఇంట్లో చార్జ్ చేసుకుంటే కిలోమీటరుకు కేవలం ఒక రూపాయి లోపే ఖర్చు అవుతుందని అంచనా. నెలకు 1,000 నుంచి 1,500 కిలోమీటర్లు తిరిగే వారికి ఈవీ ఒక వరం లాంటిది. ఒకప్పుడు ఈవీల ధరలు ఎక్కువగా ఉండేవన్న మాట వాస్తవమే అయినా, ఇప్పుడు BaaS వంటి ప్లాన్ల ద్వారా బ్యాటరీ ధరను వేరు చేసి కారును తక్కువ ధరకే అందిస్తున్నారు. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు కూడా ఈవీలు అందుబాటులోకి వచ్చాయి.
చార్జింగ్ మౌలిక సదుపాయాలు, భవిష్యత్తు
ప్రస్తుతం భారత్ లో చార్జింగ్ స్టేషన్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రధాన నగరాల్లోనే కాకుండా జాతీయ రహదారులపై కూడా ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఎంజీ మోటార్ వంటి కంపెనీలు స్థానికంగా తయారీని పెంచి, చార్జింగ్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసే పనిలో ఉన్నాయి. యూరోప్, అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే ఈ మార్పు వేగంగా కనిపిస్తోంది. పర్యావరణ హితం, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణం కావాలనుకునే వారికి 2026లో ఎలక్ట్రిక్ కారు కొనడం ఒక తెలివైన నిర్ణయంగా నిపుణులు చెబుతున్నారు