Road Safety : టూ వీలర్ సేఫ్టీకి కొత్త నిబంధన.. 125సీసీ బైకుల్లో ABS, 2 హెల్మెట్స్ తప్పనిసరి
125సీసీ బైకుల్లో ABS, 2 హెల్మెట్స్ తప్పనిసరి
Road Safety : భారతదేశంలో రోడ్డు భద్రతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా టూ వీలర్లకు సంబంధించి రెండు ముఖ్యమైన మార్పులను ప్రకటించారు. జూన్ 2026 నుంచి 125 సీసీ కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న స్కూటర్లు, బైకుల్లో ఉన్న కాంపీ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) స్థానంలో, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)ను తప్పనిసరి చేయనున్నారు. ఈ నిబంధనలు దేశంలో అత్యధికంగా వినియోగించే ఎంట్రీ-లెవల్ మోటార్‌సైకిళ్లకు వర్తిస్తాయి.
CBS స్థానంలో ABS ఎందుకు?
చిన్న ఇంజన్ ఉన్న బైకులతో జరిగే ప్రమాదాలు ఇటీవల కాలంలో పెరిగాయి. ముఖ్యంగా అత్యవసరంగా బ్రేక్ వేసినప్పుడు బైక్ అదుపు తప్పడం లేదా స్కిడ్ అవడం వల్ల తీవ్రమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే 125సీసీ వరకు ఉన్న బైకులకు కూడా సురక్షితమైన బ్రేకింగ్ టెక్నాలజీని అందించడం అవసరమని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) బ్రేక్ వేసినప్పుడు చక్రాలు లాక్ కాకుండా నిరోధిస్తుంది. దీనివల్ల వాహనం అదుపు తప్పే ప్రమాదం తగ్గుతుంది. బైక్ స్కిడ్ అవకుండా సురక్షితంగా ఆగుతుంది. 2023లో జరిగిన రోడ్డు ప్రమాద మృతుల్లో 45 శాతం మంది ద్విచక్ర వాహనదారులే ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ కొత్త మార్గదర్శకాలతో లక్షలాది మంది ప్రజలు సురక్షితమైన డ్రైవింగ్ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఇంతకు ముందు ఏబీఎస్ ఫీచర్ కేవలం ప్రీమియం బైకుల్లో మాత్రమే ఉండేది.
రెండు హెల్మెట్‌లు తప్పనిసరి
భద్రతకు సంబంధించి ప్రభుత్వం మరో ముఖ్యమైన ఆదేశాన్ని కూడా జారీ చేసింది. జూన్ 2026 తర్వాత విక్రయించే ప్రతి బైక్ కొనుగోలుతో పాటు, రెండు హెల్మెట్‌లను తప్పనిసరిగా కొనాల్సి ఉంటుంది. దీని వెనుక ముఖ్య ఉద్దేశం కుటుంబంలో ఒక్కరి భద్రతకే కాకుండా, బైక్ నడిపే వారితో పాటు వెనుక కూర్చునే వ్యక్తి (పిలియన్ రైడర్) భద్రతను కూడా నిర్ధారించడం.
కొత్త నిబంధనల ఆవశ్యకత
ప్రతి సంవత్సరం బైక్ ప్రమాదాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సరైన బ్రేకింగ్ లేకపోవడం, వెనుక కూర్చునే ప్రయాణీకుడికి భద్రత లేకపోవడం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలు. ఈ కొత్త నిబంధనలు ఈ సమస్యలను గణనీయంగా తగ్గించగలవు, తద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు దోహదపడతాయి.