Honda Cars : పండుగకు హోండా అదిరిపోయే ఆఫర్.. ఆ కార్ల పై రూ.95,500 తగ్గాయ్
ఆ కార్ల పై రూ.95,500 తగ్గాయ్
Honda Cars : పండుగ సీజన్‌కు ముందు కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా తన కార్ల ధరలను భారీగా తగ్గించింది. జీఎస్‌టీ నిబంధనలలో మార్పుల ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తూ, హోండా కార్లపై భారీ డిస్కౌంట్‌లను ప్రకటించింది. దీంతో హోండా అమేజ్, హోండా ఎలివేట్, హోండా సిటీ మోడల్స్ ఇప్పుడు మరింత తక్కువ ధరకే లభిస్తున్నాయి. పండుగ సీజన్‌కు ముందు కారు కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు హోండా కార్స్ ఇండియా ఒక శుభవార్త ప్రకటించింది. సెప్టెంబర్ 22, 2025 నుండి అమల్లోకి వచ్చే జీఎస్‌టీ నిబంధనల ప్రయోజనాన్ని తమ కస్టమర్లకు పూర్తిగా బదిలీ చేస్తామని కంపెనీ తెలిపింది. ఈ నిర్ణయం కస్టమర్లకు కార్లు కొనడాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా, పండుగ సీజన్లో అమ్మకాలను కూడా పెంచుతుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, హోండా తన అన్ని మోడళ్లపై ప్రత్యేక పండుగ ఆఫర్లను కూడా అందిస్తోంది.
ఏ కార్లపై ఎంత తగ్గింపు?
హోండా అమేజ్: రెండవ జనరేషన్ హోండా అమేజ్ ధర రూ.72,800 వరకు తగ్గింది. మూడవ జనరేషన్ అమేజ్ ధరలో ఏకంగా రూ.95,500 వరకు తగ్గింపు లభించింది.
హోండా ఎలివేట్: ఈ ఎస్‌యూవీ ధరలో రూ.58,400 వరకు తగ్గింపు వచ్చింది.
హోండా సిటీ: హోండా సిటీ ధర ఇప్పుడు రూ.57,500 వరకు తగ్గింది.
హోండా ఎలివేట్ లో కొత్త ఫీచర్లు
హోండా తమ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ అయిన హోండా ఎలివేట్‌ను కొత్త ఇంటీరియర్ కలర్ ఆప్షన్లు, మరిన్ని ఫీచర్లతో విడుదల చేసింది. ఇందులో భాగంగా, ఎలివేట్ టాప్-ఎండ్ ZX ట్రిమ్‌లో కొత్త ఐవరీ కలర్ థీమ్, డోర్ లైనింగ్‌లు, ఇన్స్ట్రుమెంట్ ప్యానల్‌పై ఐవరీ సాఫ్ట్ టచ్ ఇన్సర్ట్‌లు, అలాగే ఐవరీ లెదరెట్ సీట్లు ఉన్నాయి. అదనంగా, 7 కలర్ యాంబియంట్ లైటింగ్, కొత్త 360-డిగ్రీ సరౌండ్ విజన్ కెమెరా, కొత్త ఆల్ఫా-బోలాడ్ ప్లస్ గ్రిల్ వంటి ఫీచర్లు కూడా ఆప్షనల్‌గా లభిస్తున్నాయి. వీటితో పాటు V , VX ట్రిమ్‌లను కూడా హోండా అప్‌డేట్ చేసింది.
2026లో హోండా ఎలివేట్ హైబ్రిడ్
హోండా 2026 పండుగ సీజన్‌లో ఎలివేట్ హైబ్రిడ్ ఎస్‌యూవీని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. పవర్‌ట్రైన్ వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ, హోండా సిటీ ఈ:హెచ్‌ఈవీ (e:HEV)లో ఉపయోగించిన అట్కిన్సన్ సైకిల్ 1.5 లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ను ఈ కారులో కూడా ఉపయోగించవచ్చని భావిస్తున్నారు. ఈ పవర్‌ట్రైన్ ఈసీవీటీ (eCVT) గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ భారీ ధరల తగ్గింపు, కొత్త ఫీచర్ల అప్‌డేట్‌లతో, పండుగ సీజన్‌లో హోండా కార్లకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.