Honda CB500 : రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు గట్టి పోటీగా హోండా కొత్త 501cc బైక్.. సీబీ500 బుకింగ్స్ షురూ

సీబీ500 బుకింగ్స్ షురూ

Update: 2026-07-29 17:06 GMT

Honda CB500 : ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా భారతీయ బైక్ లవర్లకు అదిరిపోయే వార్త అందించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు తన సరికొత్త హోండా సీబీ500 బైక్ బుకింగ్స్‌ను దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభించింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు దేశవ్యాప్తంగా ఉన్న హోండా బిగ్‌వింగ్ షోరూమ్‌లకు వెళ్లి ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. ఇటీవల జరిగిన ఒక ప్రీమియం మోటార్‌సైకిల్ ఈవెంట్‌లో సీబీ500తో పాటు రెబెల్ 300, ఎక్స్ఆర్300ఎల్ మోడళ్లను కూడా ప్రదర్శించగా, ముందుగా సీబీ500 మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు.

ఫ్లెక్స్ ఫ్యూయెల్ సపోర్ట్.. శక్తివంతమైన ఇన్‌జన్

ఈ బైక్‌లోని ప్రధాన విశేషం ఏమిటంటే.. ఇందులో 501cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను అమర్చారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో ఈ బైక్ E20 నుంచి E85 వరకు ఏ రకమైన ఇథనాల్ బ్లెండెడ్ ఇంధనంతోనైనా నడిచేలా రూపుదిద్దుకుంది. ఈ శక్తివంతమైన ఇంజన్ 27.76 bhp పవర్‌ను, 43 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. అలాగే ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు. దీనివల్ల సిటీ రోడ్లపై మాత్రమే కాకుండా, సుదీర్ఘమైన హైవే రైడింగ్‌లో కూడా అద్భుతమైన రైడింగ్ అనుభూతి లభిస్తుందని కంపెనీ చెబుతోంది.

రేట్రో డిజైన్‌తో పాటు మోడర్న్ ఫీచర్లు

హోండా సీబీ500 మోడల్‌ను పాతకాలపు క్లాసిక్ లుక్, ఆధునిక ఫీచర్ల కలయికగా తయారు చేశారు. ఇందులో రౌండ్ షేప్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, దృఢమైన ఫ్యూయెల్ ట్యాంక్, రిబ్బెడ్ సింగిల్ పీస్ సీట్, స్టైలిష్ టెయిల్ లైట్స్ ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయి. మెరుగైన గ్రిప్ కోసం ముందు భాగంలో 19 ఇంచుల వీల్, వెనుక భాగంలో 17 ఇంచుల వీల్ ఇచ్చారు. టాప్ వేరియంట్లలో ట్యూబ్‌లెస్ క్రాస్-స్పోక్ వీల్స్, మెక్సిస్ టైర్లు రానుండగా, బేస్ మోడళ్లలో అలాయ్ వీల్స్ రానున్నాయి. సస్పెన్షన్ కోసం ముందు ఫ్రంట్ యుఎస్డి ఫోర్క్స్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్లతో పాటు సేఫ్టీ కోసం రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్స్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఇచ్చారు.

మేడ్ ఇన్ ఇండియా విత్ ఎఫర్డబుల్ ప్రైస్

ఈ 501cc బైక్‌ను హోండా భారతదేశంలోనే స్వయంగా తయారు చేయనుంది. మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో దీని తయారీ వ్యయం తగ్గి, మార్కెట్లో చాలా తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ఫలితంగా మిడిల్‌వేట్ క్లాసిక్ బైక్ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650, బుల్లెట్ 650, బిఎస్ఏ గోల్డ్‌స్టార్ 650 మోడళ్లకు ఇది గట్టి సవాలు విసరనుంది. కంపెనీ త్వరలోనే దీని అధికారిక ధరను మరియు లాంచ్ డేట్‌ను ప్రకటించనుంది.

Tags:    

Similar News