Honda: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో గత కొన్ని సంవత్సరాలుగా హైబ్రిడ్ కార్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఇన్నోవా హైక్రాస్, గ్రాండ్ విటారా వంటి కార్లకు కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. కానీ ఇదే సమయంలో హోండా సంస్థకు చెందిన పాపులర్ ప్రీమియం సెడా హోండా సిటీ హైబ్రిడ్ మాత్రం తీవ్ర నిరాశను ఎదుర్కొంటోంది. గడచిన ఆగస్టు 2026 నెలలో ఈ కారును కొనుగోలు చేయడానికి కేవలం 30 మంది మాత్రమే ముందుకు రావడం గమనార్హం.

గత నెలలో హోండా సిటీ హైబ్రిడ్ కారు కేవలం 30 యూనిట్ల అమ్మకాలు మాత్రమే నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ కారు విక్రయాలు ఏకంగా 63 శాతం మేర పడిపోయాయి. సరిగ్గా ఏడాది క్రితం ఇదే నెలలో 82 మంది కస్టమర్లు ఈ కారును కొనుగోలు చేశారు. మార్కెట్లో ఇంత మంచి మైలేజ్ మరియు ఫీచర్లు ఉన్నప్పటికీ, కస్టమర్లు ఈ మోడల్ వైపు పెద్దగా ఆసక్తి చూపకపోవడం ఆటోమొబైల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ హోండా సిటీ హైబ్రిడ్ కారు లగ్జరీతో పాటు అత్యుత్తమ ఇంధన సామర్థ్యాన్ని కోరుకునే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. దీని ఎక్స్ టీరియర్ చాలా స్పోర్టీగా, ప్రీమియంగా కనిపిస్తుంది. ముందు భాగంలో ఆకర్షణీయమైన క్రోమ్ గ్రిల్, నీలిరంగు అవుట్‌లైన్‌తో కూడిన హోండా లోగో అలాగే స్లీక్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు ఉన్నాయి. ఇక కారు లోపలి క్యాబిన్ విషయానికి వస్తే, డ్యూయల్ టోన్ ఇంటీరియర్, సౌకర్యవంతమైన సీట్లు అలాగే 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అమర్చబడి ఉన్నాయి.

ఈ కారు పనితీరు పరంగా చూస్తే, ఇందులో 1.5-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో కలిసి పనిచేస్తుంది. ఈ హైబ్రిడ్ సెటప్ ద్వారా కారు గరిష్టంగా 126 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఈ-సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇవ్వడం వల్ల డ్రైవింగ్ అనుభవం చాలా సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా ఈ కారు లీటరుకు దాదాపు 27.13 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ పరిమాణం గల సెడాన్ కారుకు ఈ స్థాయిలో మైలేజ్ రావడం నిజంగా విశేషం.

ప్రయాణీకుల సేఫ్టీ విషయంలో హోండా సంస్థ ఎప్పుడూ రాజీ పడదు. ఈ సిటీ హైబ్రిడ్ కార్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్‌తో కూడిన ఈబీడీ, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అలాగే 360-డిగ్రీ లేన్-వాచ్ కెమెరా వంటి కీలకమైన ఫీచర్లు ఉన్నాయి. ఇవే కాకుండా ఇందులో హోండా సెన్సింగ్ అనగా లెవల్-1 అడాస్ టెక్నాలజీ భద్రత లభిస్తుంది. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

హోండా సిటీ హైబ్రిడ్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.19 లక్షల వరకు ఉంది. సాధారణ పెట్రోల్ కార్లతో పోలిస్తే ఈ హైబ్రిడ్ మోడల్ ధర చాలా ఎక్కువగా ఉండటమే దీని అమ్మకాలు మందగించడానికి ప్రధాన కారణం కావచ్చు. అయితే రోజువారీ ప్రయాణం ఎక్కువగా ఉండే వారికి ఈ కారు ఇచ్చే అద్భుతమైన మైలేజ్, పెట్రోల్ ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది. అధిక ధర కారణంగా సామాన్య కొనుగోలుదారులు దీనికి దూరంగా ఉంటున్నప్పటికీ, ప్రీమియం కార్ల ప్రియులకు ఇది మంచి ఎంపికగా నిలుస్తుంది.

Tags: