Honda : సరికొత్త ఎస్‌యూవీలు, చౌకైన హైబ్రిడ్ టెక్నాలజీ.. 2028 నుంచి రోడ్లపై హోండా హవా

2028 నుంచి రోడ్లపై హోండా హవా

Update: 2026-05-14 13:18 GMT

Honda : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తన పట్టును మరింత బిగించేందుకు హోండా కార్స్ ఇండియా సరికొత్త మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. కేవలం కార్లను అమ్మడమే కాకుండా, అత్యాధునిక డిజిటల్ సర్వీసులు, చౌకైన హైబ్రిడ్ టెక్నాలజీని కస్టమర్లకు చేరువ చేయడమే లక్ష్యంగా కొత్త వ్యూహాన్ని ప్రకటించింది. 2028వ సంవత్సరం నుంచి భారతదేశంలో ప్రత్యేకంగా రూపొందించిన సబ్-4 మీటర్, మిడ్-సైజ్ ఎస్‌యూవీలను లాంచ్ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. దీనివల్ల రాబోయే రోజుల్లో టాటా నెక్సాన్, మారుతి బ్రెజా వంటి కార్లకు గట్టి పోటీ ఎదురుకానుంది.

కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు హోండా హోండా డిజిటల్ ఇన్నోవేషన్ ఇండియా (HDII) అనే కొత్త అనుబంధ సంస్థను స్థాపించింది. ఈ సంస్థ ద్వారా కస్టమర్లకు మొబిలిటీ అనుభవాలను డిజిటల్ రూపంలో అందించనున్నారు. అంటే కారు కొనుగోలు నుంచి సర్వీసింగ్ వరకు అన్నీ స్మార్ట్‌గా, సులభంగా జరిగిపోతాయన్నమాట. ఈ సేవలు మార్చి 31, 2027 లోపు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల హోండా కస్టమర్లకు మరియు కంపెనీకి మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడనుంది.

ప్రస్తుతం హైబ్రిడ్ కార్ల ధరలు కాస్త ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు హోండా తన తదుపరి తరం హైబ్రిడ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోంది. 2023 నాటి టెక్నాలజీతో పోలిస్తే కొత్త సిస్టమ్ ధరను ఏకంగా 30 శాతం తగ్గించాలని హోండా లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల సామాన్యులకు కూడా హైబ్రిడ్ కార్లు అందుబాటులోకి వస్తాయి. ఈ కొత్త టెక్నాలజీ వల్ల మైలేజీ 10 శాతం పెరుగుతుందని, డ్రైవింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

భారత మార్కెట్ కోసం హోండా PF2 అనే సరికొత్త మోడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందిస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్‌పై తయారయ్యే కార్లు ప్రస్తుతం ఉన్న వాటి కంటే 90 కిలోలు తక్కువ బరువు ఉంటాయి. బరువు తగ్గడం వల్ల కార్ల వేగం పెరగడమే కాకుండా మైలేజీ కూడా మెరుగుపడుతుంది. చిన్న, మధ్య తరహా ఎస్‌యూవీలను ఈ ప్లాట్‌ఫారమ్‌పైనే తయారు చేయనున్నారు. ఇది పూర్తిగా హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌కు సపోర్ట్ చేసేలా డిజైన్ చేయబడింది.

గ్లోబల్ మార్కెట్‌పై కూడా హోండా దృష్టి సారించింది. ముఖ్యంగా అమెరికా మార్కెట్ కోసం కొత్త ప్లాట్‌ఫారమ్‌పై పెద్ద హైబ్రిడ్ వాహనాలను సిద్ధం చేస్తోంది. ఇందులో శక్తివంతమైన వి6 (V6) ఇంజన్లను వాడనున్నారు. ఇవి కఠినమైన కాలుష్య నిబంధనలను పాటిస్తూనే, ప్రస్తుత పెట్రోల్ కార్ల కంటే 30 శాతం ఎక్కువ మైలేజీని ఇస్తాయి. అంతేకాకుండా, ఇవి వేగాన్ని అందుకోవడంలో 10 శాతం మెరుగ్గా ఉంటాయని హోండా ధీమా వ్యక్తం చేస్తోంది.

భద్రత విషయంలో హోండా ఎప్పుడూ ముందుంటుంది. 2028లో సరికొత్త అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌ను లాంచ్ చేయబోతోంది. ఈ టెక్నాలజీని రాబోయే ఐదేళ్లలో 15 కంటే ఎక్కువ మోడళ్లలో ప్రవేశపెట్టాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గడమే కాకుండా, డ్రైవింగ్ మరింత సురక్షితంగా మారుతుంది. మొత్తానికి హోండా పక్కా ప్లాన్‌తో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను భారీగా ప్రారంభించబోతోంది.

Tags:    

Similar News