Honda : ఈవీ మార్కెట్లో హోండా గ్రాండ్ ఎంట్రీ.. వచ్చే ఏడాదే భారత్‌లో మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

Update: 2026-07-20 11:53 GMT

Honda : ప్రపంచ ప్రసిద్ధ వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. మిగతా కంపెనీలతో పోలిస్తే కాస్త ఆలస్యంగా ఈవీ మార్కెట్లోకి వస్తున్నప్పటికీ, పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో అంటే వచ్చే ఏడాది జనవరి, మార్చి 2027 మధ్యకాలంలో భారత్‌లో తమ తొలి గ్రౌండ్-అప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.

రూ. 1,200 కోట్ల భారీ పెట్టుబడి

భారత్‌ను కేవలం ఒక విక్రయ కేంద్రంగానే కాకుండా గ్లోబల్ ఎగుమతి హబ్‌గా మార్చాలని హోండా ప్రణాళికలు రచిస్తోంది. స్థానికంగా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ తయారీ, ప్లాంట్ అప్‌గ్రేడేషన్ కోసం కంపెనీ ఏకంగా రూ.1,200 కోట్ల పెట్టుబడిని ప్రకటిస్తోంది. ఇక్కడ తయారుచేసే ఈవీలను స్వదేశీ మార్కెట్‌తో పాటు జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేయనుండటం విశేషం. దీనివల్ల భారతీయ ఆటోమొబైల్ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాధాన్యత పెరగనుంది.

హోండా 0 ఆల్ఫా కాన్సెప్ట్‌తో సరికొత్త డిజైన్

ఈ నూతన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని గ్లోబల్‌గా ప్రదర్శించిన హోండా 0 ఆల్ఫా కాన్సెప్ట్‌ ఆధారంగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం భారతీయ రోడ్లపై జరుగుతున్న టెస్టింగ్ వాహనాలను పరిశీలిస్తే.. దీని వెనుక భాగం ఫ్లాట్‌గా ఉంటూ పెద్ద గ్లాస్ ఏరియాతో కనిపిస్తోంది. సాధారణ కూపే డిజైన్‌ల కంటే, రోజూ ఉపయోగించే ప్రయాణికులకు పెద్ద కేబిన్ స్పేస్ మరియు సౌకర్యాన్ని అందించడానికే హోండా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 కిమీ రేంజ్

ఈ ఎస్‌యూవీకి సంబంధించిన బ్యాటరీ, మోటార్ వివరాలను హోండా అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఇది రెండు వేర్వేరు బ్యాటరీ ఆప్షన్లలో లభించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. టాప్ వేరియంట్‌లో అందించే పెద్ద బ్యాటరీ ప్యాక్ ద్వారా ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 450 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వీలుంటుంది. నగర ప్రయాణాలకు మాత్రమే కాకుండా సుదీర్ఘమైన హైవే ప్రయాణాలకు కూడా ఇది ఎంతగానో అనుకూలిస్తుంది. భారతీయ రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా హోండా ప్రస్తుతం ఈ వాహనాన్ని విస్తృతంగా పరీక్షస్తోంది.

Tags:    

Similar News