Hyundai Creta EV : భారీగా తగ్గిన హ్యుందాయ్ క్రెటా ఈవీ ధర.. ఇప్పుడు కేవలం రూ.10.99 లక్షలకే సొంతం చేసుకోండి

కేవలం రూ.10.99 లక్షలకే సొంతం చేసుకోండి

Update: 2026-07-03 14:23 GMT

Hyundai Creta EV : ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక సూపర్ గుడ్ న్యూస్. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తన మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీ క్రెటా ఎలక్ట్రిక్ ధరను సామాన్యులకు సైతం అందుబాటులోకి తెస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్ల ధరలు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం వాటిలో వాడే బ్యాటరీలే. ఈ సమస్యకు పరిష్కారంగా హ్యుందాయ్ సరికొత్త బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ మోడల్‌ను భారత మార్కెట్లోకి పరిచయం చేసింది. ఈ సరికొత్త ప్లాన్ కారణంగా ఇప్పుడు హ్యుందాయ్ క్రెటా ఈవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.10.99 లక్షలకే లభిస్తోంది. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టలేక ఇబ్బంది పడే మధ్యతరగతి వినియోగదారులకు ఈ ఆఫర్ ఒక అద్భుతమైన అవకాశమనే చెప్పాలి.

ఈ BaaS మోడల్ కింద కస్టమర్లు కారును, బ్యాటరీని విడివిడిగా కొనుగోలు చేయవచ్చు. అంటే, కారును కొనే సమయంలో బ్యాటరీ పూర్తి ధరను ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం కారు బాడీకి మాత్రమే డబ్బులు చెల్లించి, బ్యాటరీ కోసం ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ లేదా ఫైనాన్స్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. హ్యుందాయ్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్లాన్ కింద బ్యాటరీ ఈఎంఐ మీరు తిరిగే కిలోమీటర్ల ఆధారంగా లెక్కిస్తారు. ఇది కిలోమీటరుకు కేవలం రూ.3.90 నుంచి ప్రారంభమవుతుంది. మీరు కారును ఎంత ఎక్కువ ఉపయోగిస్తే దానికి తగ్గట్టుగా కిందకి మీ బడ్జెట్‌లో వాయిదాలు చెల్లించుకునే వెసులుబాటు ఇందులో ఉంటుంది.

ధరను తగ్గించడమే కాకుండా, కస్టమర్ల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని క్రెటా ఎలక్ట్రిక్ కారులో హ్యుందాయ్ కొన్ని సరికొత్త అప్‌డేట్స్ చేసింది. ఇప్పుడు ఈ ఎస్‌యూవీలోని అన్ని వేరియంట్లలో ఇంటిగ్రేటెడ్ సైడ్ ఫుట్ స్టెప్‌ను స్టాండర్డ్‌గా ఇస్తున్నారు. దీనివల్ల వృద్ధులు, పిల్లలు కారు ఎక్కడం, దిగడం చాలా సులభంగా మారుతుంది. దీనితో పాటు వినియోగదారుల డిమాండ్‌ మేరకు 7.4 kW వాల్ బాక్స్ హోమ్ ఛార్జర్‌ను కూడా కారుతో పాటు ఉచితంగా ఇస్తున్నారు. దీనివల్ల కస్టమర్లు తమ ఇంటి వద్దే ఎలాంటి ఇబ్బంది లేకుండా కారును చాలా వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో 42 kWh, 51.4 kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. పెద్దదైన 51.4 kWh బ్యాటరీ ప్యాక్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 510 కిలోమీటర్ల అద్భుతమైన డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని ఏఆర్ఏఐ ధృవీకరించింది. అంతేకాదు, డీసీ ఫాస్ట్ ఛార్జర్ సాయంతో ఈ కారు కేవలం 39 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. స్పీడ్ విషయానికి వస్తే, దీని లాంగ్ రేంజ్ వేరియంట్ కేవలం 7.9 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇక భద్రత విషయానికొస్తే, ఈ కారు బ్యాటరీపై కంపెనీ 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వరకు పటిష్టమైన వారంటీని అందిస్తోంది.

కార్ల అమ్మకాలతో పాటు ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ మౌలిక వసతులను పెంచేందుకు హ్యుందాయ్ వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 183 కీలక ప్రాంతాలలో 214 డీసీ ఫాస్ట్ ఛార్జర్లను, మొత్తం 399 ఛార్జింగ్ పాయింట్లను కంపెనీ సొంతంగా ఏర్పాటు చేసింది. ఇవే కాకుండా, కస్టమర్లు తమ మై హ్యుందాయ్ మొబైల్ యాప్ ద్వారా భారతదేశం అంతటా ఉన్న సుమారు 10,000 కంటే ఎక్కువ ఇతర ఈవీ ఛార్జింగ్ పాయింట్ల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. తద్వారా లాంగ్ జర్నీలు చేసేటప్పుడు ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలనే టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ప్రయాణించవచ్చు.

Tags:    

Similar News