Hyundai : భారత్‌లో హ్యుందాయ్ 30 ఏళ్ల ప్రస్థానం.. 2030 నాటికి 26 కొత్త కార్లతో దండయాత్ర

2030 నాటికి 26 కొత్త కార్లతో దండయాత్ర

Update: 2026-05-07 08:13 GMT

Hyundai : దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ భారత గడ్డపై అడుగుపెట్టి అప్పుడే మూడు దశాబ్దాలు గడిచిపోయాయి. 1996లో చిన్న అడుగుతో మొదలైన హ్యుందాయ్ ప్రయాణం, నేడు దేశంలోనే రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ఎదిగింది. ఈ 30 ఏళ్ల వేడుకల సందర్భంగా కంపెనీ తన విజయాలను నెమరువేసుకోవడమే కాకుండా, రాబోయే ఐదేళ్ల కోసం భారీ ప్రణాళికలను ప్రకటించింది. 2030 నాటికి ఏకంగా 26 కొత్త కార్లను లాంచ్ చేయడమే లక్ష్యంగా హ్యుందాయ్ సిద్ధమవుతోంది.

దక్షిణ కొరియా కంపెనీ అయిన హ్యుందాయ్, 1996లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. నాటి నుంచి నేటి వరకు మొత్తం 1.35 కోట్ల (13.5 మిలియన్లు) కంటే ఎక్కువ కార్లను విక్రయించి రికార్డు సృష్టించింది. ఇందులో 96 లక్షల కార్లు మన దేశంలోనే అమ్ముడవ్వగా, మరో 39 లక్షల కార్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇప్పటివరకు సుమారు రూ. 40,700 కోట్ల పెట్టుబడి పెట్టిన కంపెనీ, భారత ఆటోమొబైల్ రంగంలో చెరగని ముద్ర వేసింది.

మున్ముందు కూడా తన హవాను కొనసాగించేందుకు హ్యుందాయ్ సిద్ధమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 2029-30 మధ్య కాలంలో మరో రూ. 45,000 కోట్ల భారీ పెట్టుబడిని పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నిధులను ప్రధానంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి, అత్యాధునిక టెక్నాలజీ, ఫ్యూచర్ మోబిలిటీ సొల్యూషన్స్ కోసం ఖర్చు చేయనుంది. 2030 నాటికి 26 కొత్త కార్లను మరియు వాటి వేరియంట్లను ప్రవేశపెట్టడం ద్వారా మార్కెట్ వాటాను మరింత పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది.

హ్యుందాయ్ తన ప్రస్థానాన్ని 1996లో చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్ ప్లాంట్‌తో మొదలుపెట్టింది. ఆ తర్వాత 2025లో పూణేలోని తలేగావ్‌లో రెండో ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ రెండు ప్లాంట్లు కలిసి ఏడాదికి 9.94 లక్షల కార్లను తయారు చేస్తున్నాయి. అయితే, 2028 నాటికి ఈ సామర్థ్యాన్ని 10.74 లక్షల యూనిట్లకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కార్లను సరఫరా చేయడం సులభతరం అవుతుంది.

హ్యుందాయ్ కంపెనీకి భారత్ కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు, ఒక అతిపెద్ద ఎగుమతి కేంద్రం కూడా. ఇక్కడ తయారైన కార్లు సౌదీ అరేబియా, మెక్సికో, చిలీ, పెరూ, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు వెళ్తున్నాయి. 2008లో 5 లక్షల ఎగుమతులతో మొదలైన ప్రయాణం, 2026 నాటికి 39 లక్షల యూనిట్లకు చేరుకోవడం గమనార్హం. అంటే ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్న చాలా హ్యుందాయ్ కార్లు మేడ్ ఇన్ ఇండియా అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు.

దేశవ్యాప్తంగా హ్యుందాయ్కి అత్యంత బలమైన నెట్‌వర్క్ ఉంది. ప్రస్తుతం 1,100 కంటే ఎక్కువ పట్టణాల్లో 1,500 కంటే ఎక్కువ షోరూమ్‌లు ఉన్నాయి. అంటే దేశంలోని దాదాపు 78 శాతం జిల్లాల్లో హ్యుందాయ్ ఉనికి ఉంది. సర్వీసింగ్ విషయంలో కూడా వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా 1,675 సర్వీస్ పాయింట్లు, 162 మొబైల్ సర్వీస్ వ్యాన్‌లను కంపెనీ నిర్వహిస్తోంది. సుమారు 50,000 మంది సర్వీస్ నిపుణులు నిరంతరం అందుబాటులో ఉంటూ కస్టమర్లకు సేవలు అందిస్తున్నారు.

Tags:    

Similar News