Hyundai Creta EV : కారు వాడి తిరిగి ఇచ్చేయొచ్చు.. రీసేల్ టెన్షన్‌కు హ్యుందాయ్ చెక్!
రీసేల్ టెన్షన్‌కు హ్యుందాయ్ చెక్!
Hyundai Creta EV : ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలని ఆసక్తి ఉన్నప్పటికీ కొన్ని సంవత్సరాల తర్వాత దానికి రీసేల్ వ్యాల్యూ ఎంత వస్తుంది? బ్యాటరీ లైఫ్ ఎలా ఉంటుంది? అనే సందేహాలతో చాలామంది వెనకడుగు వేస్తుంటారు. కొనుగోలుదారుల్లో ఉన్న ఈ భయాలను పోగొట్టేందుకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చింది. తమ పాపులర్ మోడల్ క్రెటా ఎలక్ట్రిక్ కోసం అష్యూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రామ్‌ను అధికారికంగా ప్రారంభించింది. ఈ పథకం కింద కారు కొన్న గ్రాహకులు 3 సంవత్సరాలు లేదా 45,000 కిలోమీటర్లు వాడిన తర్వాత కారును కంపెనీకి తిరిగి అమ్మేయవచ్చు. దీనికిగానూ కంపెనీ కారు కొనుగోలు ధరకు సంబంధించి 60 శాతం గ్యారెంటీ అమౌంట్‌ను వినియోగదారులకు తిరిగి చెల్లిస్తుంది.
వినియోగదారుల నమ్మకమే లక్ష్యం
ఈ ఆఫర్ గురించి హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ తరుణ్ గర్గ్ మాట్లాడుతూ.. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరగాలంటే కేవలం కొత్త టెక్నాలజీ మాత్రమే సరిపోదని, కస్టమర్లలో నమ్మకాన్ని కలిగించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. 60 శాతం అష్యూర్డ్ బైబ్యాక్ వ్యాల్యూ అనేది తమ కారు క్వాలిటీ, పెర్ఫార్మెన్స్, దీర్ఘకాలిక విలువపై కంపెనీకి ఉన్న నమ్మకానికి నిదర్శనమని చెప్పారు. అంతేకాకుండా, ప్రారంభ కొనుగోలు వ్యయాన్ని తగ్గించడానికి క్రెటా ఎలక్ట్రిక్‌ను ఇప్పటికే బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ మోడల్‌లో కూడా అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.
ధర, బ్యాటరీ ఆప్షన్లు, డ్రైవింగ్ రేంజ్
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.99 లక్షలుగా ఉంది. బ్యాటరీ కోసం నెలకు కిలోమీటరుకు రూ. 3.9 చొప్పున ఈఎమ్‌ఐ చెల్లించే సౌకర్యాన్ని కూడా అందించారు. ఈ ఈవీ కారు రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది:
* 51.4 kWh బ్యాటరీ ప్యాక్: ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 510 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఇస్తుంది.
* 42 kWh బ్యాటరీ ప్యాక్: ఇది సింగిల్ ఛార్జ్‌పై 420 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.
ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం.. టాటా ఈవీలకు గట్టి పోటీ
సుదూర ప్రయాణాలు చేసే వారికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఈ ఎస్‌యూవీలో డిసి ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని పొందుపరిచారు. ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కారు బ్యాటరీని కేవలం 39 నిమిషాల్లోనే 10% నుంచి 80% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. భారత మార్కెట్లో టాటా నెక్సాన్ ఈవీ, టాటా హారియర్ ఈవీ వంటి ప్రముఖ మోడళ్లకు ఈ క్రెటా ఎలక్ట్రిక్ కారు నేరుగా పోటీ ఇస్తోంది. హ్యుందాయ్ తీసుకొచ్చిన ఈ 60% బైబ్యాక్ ప్లాన్‌తో ఈవీ విక్రయాలు భారీగా పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.