EV India : ఈవీ టూ-వీలర్ల మార్కెట్లో రికార్డు.. ప్రపంచంలోనే నంబర్ 2 స్థానానికి ఎగబాకిన భారత్

ప్రపంచంలోనే నంబర్ 2 స్థానానికి ఎగబాకిన భారత్

Update: 2026-05-21 12:23 GMT

EV India : భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకుల హవా అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ విడుదల చేసిన గ్లోబల్ ఈవీ అవుట్‌లుక్ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోనే అత్యధికంగా ఎలక్ట్రిక్ టూ-వీలర్లు అమ్ముడవుతున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. ఈ విషయంలో డ్రాగన్ కంట్రీ చైనా మొదటి స్థానంలో ఉండగా, మనదేశం గ్లోబల్ మార్కెట్లో రన్నరప్‌గా నిలిచింది. ఓలా, టీవీఎస్, ఏథర్, బజాజ్ వంటి స్వదేశీ కంపెనీల దూకుడుతో భారత్‌లో ఈవీ విప్లవం నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుందనడానికి ఈ అంతర్జాతీయ నివేదికే నిదర్శనం.

ఒక్క ఏడాదిలోనే 13 లక్షల ఈవీ బండ్లు..

ఐఈఏ నివేదిక ప్రకారం.. అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ టూ-వీలర్ల విక్రయాలు 15 శాతం వృద్ధితో ఏకంగా కోటి యూనిట్లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న మొత్తం ద్విచక్ర వాహనాల్లో ఈవీల వాటా 14 శాతానికి పెరిగింది. ఇందులో భాగంగానే భారతదేశంలో గడిచిన ఏడాది కాలంలో సుమారు 13 లక్షల ఎలక్ట్రిక్ టూ-వీలర్లు అమ్ముడయ్యాయి. మన దేశంలో అమ్ముడవుతున్న మొత్తం బైకులు, స్కూటర్లలో ఎలక్ట్రిక్ మోడళ్ల వాటా దాదాపు 6 శాతంగా నమోదైంది. దీన్ని బట్టి చూస్తే భారతీయులు నెమ్మదిగా పెట్రోల్ బండ్ల నుండి బ్యాటరీ వాహనాల వైపు షిఫ్ట్ అవుతున్నట్లు స్పష్టమవుతోంది.

చైనా నంబర్ వన్ పీఠం..

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో చైనా తన తిరుగులేని నంబర్ వన్ స్థానాన్ని అలాగే కాపాడుకుంది. చైనాలో ఒక్క ఏడాదిలోనే ఏకంగా 70 లక్షల కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ టూ-వీలర్లు అమ్ముడయ్యాయి. అక్కడి టూ-వీలర్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా ఏకంగా 55 శాతానికి పైగా ఉండటం విశేషం. అంటే చైనా రోడ్లపై తిరిగే ప్రతి రెండు బండ్లలో ఒకటి కచ్చితంగా బ్యాటరీ బండే అన్నమాట. అక్కడ ఏటా ఈవీ విక్రయాలు 10 శాతం చొప్పున పెరుగుతూనే ఉన్నాయి.

భారత్‌లో తగ్గిన స్పీడ్.. కేంద్ర ప్రభుత్వం వేసిన బ్రేకులు ఇవేనా?

ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచినప్పటికీ, భారతదేశంలో ఈవీ అమ్మకాల వృద్ధి రేటు అనుకున్నంత వేగంగా సాగకపోవడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. గతంలో FAME-II పథకం కింద ఎలక్ట్రిక్ స్కూటర్లపై వాహనం ధరలో దాదాపు 40 శాతం వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది. కానీ, కొత్తగా వచ్చిన PM E-DRIVE పథకంలో కేంద్రం సబ్సిడీలను భారీగా తగ్గించేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఈవీ కంపెనీలు తమ వాహనాల్లో ఎక్కువ శాతం భారతదేశంలో తయారైన విడిభాగాలనే వాడాలి. ఈ నిబంధనలను అందుకోవడం చాలా కంపెనీలకు కష్టంగా మారడంతో సబ్సిడీ పొందే మోడళ్ల సంఖ్య తగ్గిపోయింది. దీనికి తోడు పెట్రోల్ బండ్లపై పన్నుల మార్పుల వల్ల వాటి ధరలు కూడా కాంపిటీటివ్‌గా మారడం ఈవీల స్పీడ్‌కు కాస్త బ్రేకులు వేసింది.

Tags:    

Similar News