Best Selling Cars : నెక్సాన్, క్రెటాలను వెనక్కి నెట్టేసిన మారుతి.. మళ్లీ నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఆ కారు
మళ్లీ నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఆ కారు
Best Selling Cars : భారతీయ కార్ల మార్కెట్ మే 2026లో అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోయింది. సాధారణ కార్లు, ఎస్‌యూవీ రెండు విభాగాలలోనూ అమ్మకాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ తన తిరుగులేని నెంబర్ వన్ స్థానాన్ని మరోసారి నిరూపించుకుంది. మారుతితో పాటు టాటా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా, కియా వంటి సంస్థలకు చెందిన పలు మోడళ్లు కూడా కస్టమర్లను ఆకట్టుకుంటూ బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో చేరిపోయాయి.
అమ్మకాల గణాంకాలు ఏం చెబుతున్నాయి?
గణాంకాల ప్రకారం.. మే 2026 లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్ల మొత్తం విక్రయాలు 1,89,908 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది మే 2025లో అమ్ముడైన 1.43 లక్షల వాహనాలతో పోలిస్తే ఇది ఏకంగా 32.8 శాతం వృద్ధి కావడం విశేషం. మరోవైపు, ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో విక్రయాలు మరింత ఊపందుకున్నాయి. మే 2026లో టాప్-15 ఎస్‌యూవీల మొత్తం విక్రయాలు 1,94,225 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే సమయంతో (1,38,397 యూనిట్లు) పోల్చితే ఇందులో 40.34 శాతం బలమైన వృద్ధి కనిపించింది.
దేశంలోనే నెంబర్-1గా నిలిచిన మారుతి డిజైర్
మారుతి సుజుకికి చెందిన పాపులర్ సెడాన్ కారు డిజైర్ మే 2026లో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్ కారుగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఒక్క నెలలోనే ఏకంగా 24,546 డిజైర్ కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో ఈ కారు అమ్మకాలు 18,084 యూనిట్లు మాత్రమే. అంటే ఏడాది కాలంలో డిజైర్ అమ్మకాలు 35.73 శాతం పెరిగాయి. మొత్తం టాప్-10 కార్ల విక్రయాల్లో కేవలం ఈ ఒక్క కారే దాదాపు 13 శాతం వాటాను కలిగి ఉండటం విశేషం.
రేసులో దూసుకొచ్చిన ఫ్రాంక్స్, ఎర్టిగా
ఈ సేల్స్ లిస్ట్‌లో మారుతి సుజుకికి చెందిన ఫ్రాంక్స్ 20,686 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఎస్‌యూవీ-కూపే మోడల్ అమ్మకాలు ఏకంగా 52.28 శాతం వృద్ధిని సాధించాయి. ఇక మూడో స్థానంలో మారుతి మోస్ట్ పాపులర్ ఎంపీవీ ఎర్టిగా నిలిచింది. మే నెలలో 20,350 ఎర్టిగా కార్లు అమ్ముడై 26.08 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
టాటా పంచ్, నెక్సాన్ హవా
టాటా మోటార్స్ సంస్థకు చెందిన మోడళ్లు కూడా మార్కెట్లో గట్టి పోటీని ఇస్తున్నాయి. టాటా పంచ్, దాని ఈవీ మోడల్ కలిసి మొత్తం 20,208 యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాయి. అలాగే టాటా నెక్సాన్, నెక్సాన్ ఈవీల మొత్తం అమ్మకాలు 19,100 యూనిట్లుగా నమోదయ్యాయి. పంచ్, నెక్సాన్ రెండింటి అమ్మకాలు కూడా గత ఏడాదితో పోలిస్తే 45 శాతం కంటే ఎక్కువ వృద్ధిని సాధించడం విశేషం. ఇది భారత మార్కెట్లో టాటా ఎస్‌యూవీలు, ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న విపరీతమైన క్రేజ్‌ను తెలియజేస్తోంది.
టాప్-10 లో నిలిచిన ఇతర ప్రముఖ కార్లు
మారుతికి చెందిన బలేనో కారు కూడా 18,396 యూనిట్ల అమ్మకాలతో (58.34 శాతం వృద్ధి) అదరగొట్టింది. వ్యాగన్ఆర్ 18,076 యూనిట్లు, సరికొత్త స్విఫ్ట్ కారు 17,519 యూనిట్ల అమ్మకాలను సాధించాయి. మరోవైపు, మహీంద్రా స్కార్పియో, స్కార్పియో ఎన్ మోడళ్లు కలిసి 15,774 యూనిట్లు అమ్ముడయ్యాయి. హ్యుందాయ్ క్రెటా, క్రెటా ఈవీల మొత్తం విక్రయాలు 15,253 యూనిట్లుగా నమోదై టాప్-10 జాబితాలో తమ స్థానాలను భద్రపరుచుకున్నాయి.
ఎస్‌యూవీ విభాగంలో ఫ్రాంక్స్ నెంబర్-1
ప్రత్యేకంగా కేవలం ఎస్‌యూవీ కేటగిరీని పరిశీలిస్తే.. మారుతి ఫ్రాంక్స్ 20,686 యూనిట్ల అమ్మకాలతో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన నెంబర్ వన్ ఎస్‌యూవీగా అవతరించింది. ఆ తర్వాతి స్థానాల్లో టాటా పంచ్ (20,208 యూనిట్లు), టాటా నెక్సాన్ (19,100 యూనిట్లు) నిలిచాయి. పంచ్, నెక్సాన్ కార్ల మొత్తం విక్రయాలు 39,000 యూనిట్లు దాటడం ఎస్‌యూవీ మార్కెట్లో టాటా మోటార్స్ సాధిస్తున్న పట్టుకు నిదర్శనం. అలాగే మహీంద్రా స్కార్పియో నాలుగో స్థానంలో, హ్యుందాయ్ క్రెటా ఐదో స్థానంలో తమ పాత క్రేజ్‌ను కంటిన్యూ చేస్తున్నాయి.
మారుతి బ్రెజ్జా అమ్మకాలు డౌన్.. కారణం ఏంటి?
మే 2026 సేల్స్ రిపోర్ట్‌లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒకప్పుడు టాప్‌లో ఉండే మారుతి బ్రెజ్జా అమ్మకాలు తగ్గడం. ఈ నెలలో బ్రెజ్జా కేవలం 13,245 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 14.91 శాతం తక్కువ. అయితే, త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్న బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ కొత్త మోడల్ కోసమే చాలా మంది కస్టమర్లు వేచి చూస్తున్నారని, అందుకే ప్రస్తుత మోడల్ అమ్మకాలు తాత్కాలికంగా తగ్గాయని ఆటోమొబైల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇతర మోడళ్ల జోరు ఇలా..
హ్యుందాయ్ వెన్యూ అమ్మకాలు 55.77 శాతం పెరిగి 11,714 యూనిట్లకు చేరాయి. కియా సెల్టోస్ ఏకంగా 74.24 శాతం వృద్ధితో 10,597 యూనిట్ల విక్రయాలను సాధించింది. టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ 14.41 శాతం పెరిగి 8,664 యూనిట్లు అమ్ముడైంది. అన్నింటికంటే ముఖ్యంగా మారుతి గ్రాండ్ విటారా ఏకంగా 80.22 శాతం అద్భుతమైన వృద్ధితో 9,366 యూనిట్ల విక్రయాలను అందుకుంది. మహీంద్రా థార్, థార్ రాక్స్ కలిసి 10,787 యూనిట్లు, కొత్త ఎక్స్-యూవీ 7ఎక్స్ఓ 13,245 యూనిట్ల మార్కును దాటగా, ఎవర్గ్రీన్ బొలెరో కారును 8,933 మంది కస్టమర్లు కొనుగోలు చేశారు.