EV Car Sales: భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు, కొత్త మోడళ్ల రాక, మెరుగైన బ్యాటరీ సామర్థ్యం, తక్కువ నిర్వహణ ఖర్చులు ఈవీల వైపు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రభావం అమ్మకాల గణాంకాల్లోనూ కనిపిస్తోంది. 2026లో ఇప్పటివరకు దేశంలో ఎలక్ట్రిక్ కార్ల రిజిస్ట్రేషన్లు 3 లక్షల మార్కును దాటాయి. నవంబర్ 9 నాటికి ఏకంగా 3,04,701 వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. గత ఏడాది పూర్తి స్థాయి అమ్మకాలతో పోలిస్తే ఈ సంఖ్య ఇప్పటికే 56 శాతం ఎక్కువ.

నవంబర్ 9 నాటికే 3 లక్షల మార్కు దాటిన ఈవీలు

వాహన్ డేటా ఆధారంగా ఆటోకార్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం.. 2025 క్యాలెండర్ ఏడాదిలో భారత్‌లో 1,95,571 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. 2026లో జనవరి 1 నుంచి నవంబర్ 9 వరకు 3,04,701 వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాల్లో 66 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది జూన్ నుంచి వరుసగా ఐదు నెలల పాటు ప్రతి నెలా 30 వేలకుపైగా ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. సెప్టెంబర్‌లో అత్యధికంగా 38,440 వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. ఇదే వేగం కొనసాగితే 2026 చివరి నాటికి అమ్మకాలు 3.5 లక్షల నుంచి 3.6 లక్షల వరకు చేరవచ్చని అంచనా.

టాటా మోటార్స్‌దే అగ్రస్థానం

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో టాటా మోటార్స్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. జనవరి 1 నుంచి నవంబర్ 9 వరకు కంపెనీ 1,20,895 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. దీంతో మొత్తం మార్కెట్‌లో 39.67 శాతం వాటా దక్కించుకుంది. టాటా ఈవీ విభాగంలో నెక్సాన్ ఈవీ అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా కొనసాగుతోంది. టియాగో ఈవీ, పంచ్ ఈవీకి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం టాటా ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో పలు మోడళ్లను అందిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే కంపెనీ అమ్మకాలు 58 శాతం పెరగడం ఈ మార్కెట్‌లో దాని బలాన్ని చూపిస్తోంది.

మహీంద్రా దూకుడు

ఈసారి ర్యాంకింగ్స్‌లో మరో కీలక మార్పు కనిపించింది. గత ఏడాది రెండో స్థానంలో ఉన్న జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ను మహీంద్రా వెనక్కి నెట్టింది. 2026లో నవంబర్ 9 వరకు మహీంద్రా 69,660 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించి 22.86 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో నిలిచింది. ఎంజీ మోటార్ 56,988 వాహనాలతో మూడో స్థానానికి పరిమితమైంది. విన్ఫాస్ట్ 15,867 యూనిట్లతో నాలుగో స్థానంలో ఉండగా, మారుతీ సుజుకీ 12,390 వాహనాలతో ఐదో స్థానంలో నిలిచింది. కియా 7,612, బీవైడీ 6,755, హ్యుందాయ్ 6,013 వాహనాలను విక్రయించాయి. ఈ గణాంకాలు దేశీయ కంపెనీలతో పాటు విదేశీ బ్రాండ్ల మధ్య పోటీ పెరుగుతున్నట్లు చూపిస్తున్నాయి.

లగ్జరీ ఈవీల్లో బీఎండబ్ల్యూ టాప్

లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోనూ అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ 9 వరకు బీఎండబ్ల్యూ 4,273 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించి ఈ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. మెర్సిడెస్ బెంజ్ 1,416 కార్లతో రెండో స్థానంలో ఉండగా, టెస్లా 1,153 యూనిట్లతో మూడో స్థానంలో ఉంది. వోల్వో 383, పోర్షే 83 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాయి. రోల్స్ రాయిస్ ఆరు, జేఎల్ఆర్ నాలుగు, లోటస్ మూడు, ఆడి రెండు కార్లు రిజిస్టర్ అయ్యాయి. మొత్తంగా చూస్తే భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. టాటా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, మహీంద్రా దూకుడుతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.

Tags: