Maruti: భారత ఆటోమొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ అలాగే మైక్రో ఎస్‌యూవీల మధ్య పోటీ రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతోంది. వినియోగదారుల అభిరుచికి తగినట్లుగా కార్ల తయారీ సంస్థలు కొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఇదే క్రమంలో దేశీయ దిగ్గజం మారుతి సుజుకి మరో సరికొత్త చిన్న ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతానికి వై43 అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్న ఈ కారును తొలిసారిగా భారతీయ రహదారులపై టెస్టింగ్ చేస్తుండగా గుర్తించారు. ఆటోమొబైల్ వర్గాల్లో ఈ కొత్త మోడల్ గురించిన చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఇగ్నిస్ స్థానాన్ని భర్తీ చేయనున్న కొత్త మినీ కారు

వచ్చే కాలంలో మార్కెట్ నుంచి నిష్క్రమించిన ఇగ్నిస్ మోడల్ స్థానంలో ఈ కొత్త మైక్రో ఎస్‌యూవీని ప్రవేశపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మారుతి లైనప్‌లో బ్రెజా అలాగే ఫ్రాంక్స్ కార్ల కంటే దిగువన దీన్ని ఉంచనున్నారు. బాక్సీ డిజైన్, ఆకర్షణీయమైన లుక్‌తో రానున్న ఈ కారు కొలతలు సరిగ్గా టాటా పంచ్ లేదా హ్యుందాయ్ ఎక్స్టర్ పోలికలతో ఉండేలా రూపొందిస్తున్నారు. దీన్ని ప్రత్యేకంగా నెక్సా ప్రీమియం షోరూమ్‌ల ద్వారా విక్రయించే ఆలోచనలో కంపెనీ ఉన్నట్లు సమాచారం.

పవర్ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు, సీఎన్‌జీ వెర్షన్

ఇంజన్ పనితీరు విషయానికి వస్తే, ఇందులో 1.2-లీటర్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించే అవకాశం ఉంది. ఇది 3-సిలిండర్ యూనిట్‌గా మంచి మైలేజీని ఇస్తుంది. దీనితో పాటు 5-స్ప్రీడ్ మ్యాన్యువల్ అలాగే ఏఎమ్‌టీ గేర్‌బాక్స్ ఆప్షన్లు లభిస్తాయి. అంతేకాకుండా ఫ్రాంక్స్ మోడల్‌లో ఉన్న 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌ను కూడా జోడించే ఛాన్స్ ఉంది. ప్రయాణికుల ఇంధన భారాన్ని తగ్గించేందుకు కంపెనీ దీంట్లో సీఎన్‌జీ వెర్షన్‌ను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. బూట్ స్పేస్ కోల్పోకుండా డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీని ఉపయోగించే సూచనలు కనిపిస్తున్నాయి.

టాటా పంచ్‌కు గట్టి పోటీ తప్పదా?

ప్రస్తుతం మార్కెట్లో టాటా పంచ్ పెట్రోల్ అలాగే ఎలక్ట్రిక్ వేరియంట్లతో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. గత కొన్ని నెలలుగా ప్రతి నెలా వేల సంఖ్యలో అమ్ముడవుతూ రికార్డులు సృష్టిస్తోంది. హ్యుందాయ్ ఎక్స్టర్ కూడా మార్కెట్లో తన సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో మారుతి రాబోయే వై43 మైక్రో ఎస్‌యూవీ ధరను అత్యంత పోటీతత్వంతో నిర్ణయించి, అడ్వాన్స్డ్ ఫీచర్లతో లంచ్ చేస్తే పంచ్ అమ్మకాలపై కచ్చితంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Tags: