Two Wheeler: ప్రపంచ టూ వీలర్ మార్కెట్‌లో భారత కంపెనీలు సత్తా చాటుతున్నాయి. ఒకప్పుడు జపాన్ కంపెనీల ఆధిపత్యం ఎక్కువగా కనిపించిన ఈ రంగంలో ఇప్పుడు మన దేశానికి చెందిన హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్ కంపెనీలు దూసుకెళ్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక టూ వీలర్లు విక్రయిస్తున్న కంపెనీల జాబితాలో ఈ రెండు సంస్థలు టాప్-3లో చోటు దక్కించుకున్నాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 మధ్య అమ్మకాల ఆధారంగా రూపొందిన ఈ జాబితాలో హీరో రెండో స్థానంలో, టీవీఎస్ మూడో స్థానంలో నిలిచాయి.

ప్రపంచంలో నంబర్ వన్ హోండా

ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. జపాన్‌కు చెందిన హోండా మోటార్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా కొనసాగుతోంది. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల్లో హోండా ఏకంగా 1.19 కోట్ల వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే సమయంలో 1.076 కోట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. దీంతో అమ్మకాల్లో 10.6 శాతం వృద్ధి నమోదైంది. ఇక హీరో మోటోకార్ప్ 35.45 లక్షల వాహనాలతో రెండో స్థానంలో నిలిచింది. టీవీఎస్ మోటార్ కంపెనీ 34 లక్షల వాహనాలు విక్రయించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. జపాన్‌కు చెందిన యమహా 28.89 లక్షల అమ్మకాలతో నాలుగో స్థానానికి పడిపోయింది.

హీరో అమ్మకాల్లో భారీ పెరుగుదల

హీరో మోటోకార్ప్ ఈ స్థాయికి చేరడానికి వరుసగా రెండు త్రైమాసికాల్లో నమోదైన మంచి అమ్మకాలు ప్రధాన కారణం. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ 16.77 లక్షల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 23 శాతం ఎక్కువ. రెండో త్రైమాసికంలోనూ అమ్మకాలు 10 శాతం పెరిగి 18.68 లక్షల యూనిట్లకు చేరాయి. ఈ రెండు త్రైమాసికాల అమ్మకాలు కలిపి ఆరు నెలల్లో 35.45 లక్షల వాహనాలుగా నమోదయ్యాయి. దీంతో ప్రపంచ స్థాయిలో రెండో అతిపెద్ద టూ వీలర్ కంపెనీగా హీరో నిలిచింది.

వేగంగా ఎదుగుతున్న టీవీఎస్

ఈ జాబితాలో టీవీఎస్ మోటార్ కంపెనీ అమ్మకాల వృద్ధి మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కంపెనీ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 27 శాతం పెరిగి 34 లక్షల యూనిట్లకు చేరాయి. టాప్-4 కంపెనీల్లో ఇదే అత్యధిక వృద్ధి. దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాల్లోనూ టీవీఎస్ తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. యూరప్, లాటిన్ అమెరికా సహా పలు ప్రాంతాల్లో కంపెనీ ఉనికిని పెంచుకుంటోంది. టూ వీలర్, త్రీ వీలర్ అంతర్జాతీయ వ్యాపారం 34 శాతం వృద్ధి చెంది 10 లక్షల యూనిట్లకు చేరింది. ఈ విస్తరణ కంపెనీ అమ్మకాల పెరుగుదలకు తోడ్పడింది.

ఆదాయం, లాభాల్లోనూ భారత కంపెనీల జోరు

అమ్మకాలతో పాటు ఆర్థిక ఫలితాల్లోనూ హీరో, టీవీఎస్ మంచి వృద్ధి సాధించాయి. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య హీరో మోటోకార్ప్ ఆదాయం 28 శాతం పెరిగి రూ.28,097 కోట్లకు చేరింది. కంపెనీ నికర లాభం 8 శాతం వృద్ధితో రూ.3,278 కోట్లుగా నమోదైంది. మరోవైపు టీవీఎస్ మోటార్ ఆదాయం 41 శాతం పెరిగి రూ.30,999 కోట్లకు చేరింది. పన్నులకు ముందు లాభం 52 శాతం పెరిగి రూ.3,454 కోట్లకు చేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా ఉన్న భారత్‌ నుంచి కంపెనీలు విదేశాలకు కూడా తమ వ్యాపారాన్ని విస్తరిస్తుండటం ఈ విజయానికి కీలకంగా మారింది. అయితే ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న హోండాను దాటాలంటే భారత కంపెనీలు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.

Tags: