EV Revolution : పెట్రోల్ బంకుల్లోనే ఛార్జింగ్ సౌకర్యం..దేశవ్యాప్తంగా 27 వేలకు పైగా స్టేషన్లు..ఎలక్ట్రిక్ వాహనదారులకు పండగే
ఎలక్ట్రిక్ వాహనదారులకు పండగే
EV Revolution : భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. 2025 సంవత్సరం ముగిసే సమయానికి దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులే ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్లుగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, చమురు కంపెనీల కృషితో ఈ ఏడాది ఒక భారీ మైలురాయి నమోదైంది. కేవలం పెట్రోల్ బంకుల్లోనే ఇప్పుడు 27,000 కంటే ఎక్కువ ఈవీ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనదారులకు రేంజ్ ఆందోళన తగ్గి, ప్రయాణం మరింత సులభం కానుంది.
పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో మొత్తం 27,432 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ FAME-II పథకం కింద 8,932 స్టేషన్లు ఏర్పాటు చేయగా, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (IOCL, BPCL, HPCL) తమ స్వంత నిధులతో మరో 18,500 కంటే ఎక్కువ స్టేషన్లను నిర్మించాయి. అంటే మనం పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్లే చోటే ఇప్పుడు కారుకు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు.
కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా.. బయో ఫ్యూయల్స్, CNG, LNG, EV ఛార్జింగ్ అన్నీ ఒకే చోట లభించేలా ప్రభుత్వం ఎనర్జీ స్టేషన్లను సిద్ధం చేస్తోంది. 2024-25 నుంచి 2028-29 మధ్య ఇలాంటివి 4,000 స్టేషన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, నవంబర్ 1, 2025 నాటికే 1,064 స్టేషన్లు పూర్తి కావడం విశేషం. దీనివల్ల హైవేలపై ప్రయాణించే డ్రైవర్లకు ఎక్కడికి వెళ్లాలనే ఇబ్బంది ఉండదు.
పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో బయో ఫ్యూయల్స్ కీలక పాత్ర పోషించాయి. 2024-25లో పెట్రోల్‌లో ఎథనాల్ కలిపే శాతం 19.24% కు చేరుకుంది. దీనివల్ల దాదాపు రూ.1.55 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయింది. అలాగే కార్బన్ ఉద్గారాలు భారీగా తగ్గాయి. పానిపట్, నుమాలిగఢ్‌లలో ఏర్పాటు చేసిన సెకండ్ జనరేషన్ ఎథనాల్ ప్లాంట్లు ఈ విజయానికి ప్రధాన కారణం.
కేవలం కార్లకే కాకుండా, దేశ రవాణా వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ట్రక్ డ్రైవర్ల కోసం ప్రభుత్వం అప్నా ఘర్ పేరుతో 500 కంటే ఎక్కువ విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో డ్రైవర్ల కోసం బెడ్లు, శుభ్రమైన టాయిలెట్లు, తాగునీరు, వంట చేసుకునే సౌకర్యాలు ఉన్నాయి. ఇది రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిని కూడా పెంచుతోంది. డిజిటల్ పేమెంట్స్ నుంచి ఇంటికే ఇంధనం పంపే సౌకర్యాల వరకు 2025లో పెట్రోలియం రంగం హైటెక్ హంగులను అద్దుకుంది.