Petrol Adulteration : మీ బండి మైలేజ్ అకస్మాత్తుగా పడిపోయిందా? అయితే పెట్రోల్ కల్తీనే.. బంకుల్లో జరుగుతున్న భారీ మోసాలు
బంకుల్లో జరుగుతున్న భారీ మోసాలు
Petrol Adulteration : మీ బైక్ లేదా కారు అకస్మాత్తుగా తక్కువ మైలేజ్ ఇస్తోందా? స్టార్ట్ చేసేటప్పుడు ఇబ్బంది పెడుతూ ఇంజన్ జట్కాలు ఇస్తోందా? అయితే దీనికి కారణం కేవలం వాహనంలో లోపం మాత్రమే కాకపోవచ్చు, మీరు కొట్టించే పెట్రోల్ క్వాలిటీ కూడా కావచ్చు. భారతదేశంలోని అనేక పెట్రోల్ బంకుల్లో నాణ్యత లేని కల్తీ ఇంధనాన్ని విక్రయించడం, కొలతల్లో మోసాలకు పాల్పడటం వంటి ఫిర్యాదులు తరచూ వస్తూనే ఉన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకొచ్చిన 20 శాతం ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ పాలసీ తర్వాత ఈ సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. ప్రముఖ యూట్యూబర్ మనీష్ కశ్యప్ తన కొత్త టయోటా కారు ఇథనాల్ పెట్రోల్ వల్లే పాడైపోయిందని సోషల్ మీడియాలో వీడియో పెట్టడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ కారు E20 ఇంధనానికి అనుకూలమైనదే అయినప్పటికీ, బంకుల్లో జరిగే పెట్రోల్ కల్తీ వల్లే ఇలా జరిగి ఉంటుందని కంపెనీలు భావిస్తున్నాయి.
కిరోసిన్, నాఫ్తా, నీళ్ల కల్తీ
పెట్రోల్ బంకుల్లో ఎక్కువ లాభాల కోసం ప్రధానంగా మూడు రకాలుగా కల్తీలు జరుగుతుంటాయి. మొదటిది కిరోసిన్ కలపడం. పెట్రోల్ కంటే కిరోసిన్ చౌకగా దొరుకుతుంది కాబట్టి దీన్ని ఎక్కువగా కలుపుతారు. దీనివల్ల ఇంజన్‌లో విపరీతంగా కార్బన్ పేరుకుపోయి స్పార్క్ ప్లగ్స్ పాడైపోతాయి. రెండవది నాఫ్తా కలపడం. ఇది చూడటానికి పెట్రోల్‌లాగే ఉండే ఒక చౌకైన పెట్రోలియం ఉప ఉత్పత్తి. దీనివల్ల ఇంజన్‌లో నాకింగ్ సమస్య వచ్చి లోపలి భాగాలు అరిగిపోతాయి. ఇక మూడవది, అన్నింటికంటే ప్రమాదకరమైనది నీళ్ల కల్తీ. బంకుల్లోని పాత అండర్‌గ్రౌండ్ ట్యాంకుల లీకేజీ వల్ల లేదా వర్షపు నీరు చేరడం వల్ల పెట్రోల్‌లో తేమ పెరుగుతుంది. కొత్త E20 ఇంధనంలోని ఇథనాల్‌కు నీటిని చాలా వేగంగా ఆకర్షించే గుణం ఉంటుంది. ఈ తేమ వల్ల ఇంజన్ ఫిల్టర్లు పూర్తిగా జామ్ అయిపోయి వాహనం నడిమధ్యలోనే ఆగిపోతుంది.
లీటరుకు బదులు తక్కువ కొడుతున్నారా?
బంకుల్లో కేవలం కల్తీ మాత్రమే కాదు, కొలతల్లో తక్కువ ఇవ్వడం కూడా ఒక పెద్ద ఫ్రాడ్. చాలా సార్లు మనం రూ.500 అనగానే డిస్‌ప్లే స్క్రీన్ వైపు చూస్తాం కానీ, అక్కడ రీడింగ్ ఎక్కడి నుంచి మొదలైందో గమనించం. బంక్ సిబ్బంది అంతకుముందు కస్టమర్ కొట్టించిన రీడింగ్ (ఉదాహరణకు రూ.100) దగ్గర నుండే జీరో చేయకుండా రీస్టార్ట్ చేస్తుంటారు. దీనివల్ల మనకు స్క్రీన్‌పై పూర్తి అమౌంట్ కనిపించినా, ట్యాంకులోకి మాత్రం తక్కువ పెట్రోల్ వెళ్తుంది. కాబట్టి పెట్రోల్ కొట్టించే ముందు డిస్‌ప్లేలో 0.00 ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అలాగే నూతన టెక్నాలజీ ద్వారా డిజిటల్ మీటర్లలో చిప్‌లు అమర్చి మోసాలు చేసే ముఠాలు కూడా పెరిగిపోవడంతో వాహనదారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.
లైవ్‌లోనే పెట్రోల్ క్వాలిటీ టెస్ట్ చేయండి
పెట్రోల్ క్వాలిటీపై అనుమానం వస్తే ప్రతి ఒక్కరూ బంకులోనే ఉచితంగా కొన్ని పరీక్షలు చేయవచ్చు. మొదటిది ఫిల్టర్ పేపర్ టెస్ట్. ఒక తెల్లటి ఫిల్టర్ పేపర్‌పై రెండు చుక్కల పెట్రోల్ వేస్తే, స్వచ్ఛమైన పెట్రోల్ అయితే ఆవిరైపోయి ఎలాంటి మరకను వదలను. ఒకవేళ నూనె జిడ్డు లాంటి మరక మిగిలితే అందులో కల్తీ ఉన్నట్లే. రెండవది డెన్సిటీ టెస్ట్. ప్రతి బంక్‌లో పెట్రోల్ సాంద్రతను ప్రదర్శించడం తప్పనిసరి. పెట్రోల్ సాంద్రత ఎల్లప్పుడూ క్యూబిక్ మీటరుకు 720 నుండి 775 కిలోగ్రాముల మధ్య ఉండాలి. గతంలో ప్రభుత్వం పార్లమెంట్‌లో స్వయంగా అంగీకరించిన డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో వేలాది బంకుల్లో కల్తీ, తక్కువ కొలతల మోసాలు బయటపడ్డాయి. దీనిపై ప్రభుత్వం జీపీఎస్ నిఘా, ఆటోమేషన్ లాంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వినియోగదారులుగా మనం ఎల్లప్పుడూ నమ్మకమైన బంకుల్లోనే ఇంధనం నింపుకోవడం, బిల్లులు తప్పక తీసుకోవడం ద్వారా ఈ మోసాల బారిన పడకుండా మన వాహనాలను కాపాడుకోవచ్చు.