Jeep Wrangler Willys 392 : జీప్ నుంచి పవర్‌ఫుల్ బీస్ట్.. విల్లీస్ 392 ఎడిషన్ అదిరిపోయిందిగా
విల్లీస్ 392 ఎడిషన్ అదిరిపోయిందిగా
Jeep Wrangler Willys 392 : ఆఫ్-రోడింగ్ ప్రపంచంలో జీప్ బ్రాండ్‌కు ఉండే క్రేజే వేరు. ఇప్పుడు ఆ క్రేజ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తూ కంపెనీ తన అభిమానుల కోసం అత్యంత శక్తివంతమైన లిమిటెడ్ ఎడిషన్ జీప్ వ్రాంగ్లర్ విల్లీస్ 392ని ఆవిష్కరించింది. పాతకాలపు విల్లీస్ జీప్ క్లాసిక్ స్టైల్‌ను, నేటి ఆధునిక టెక్నాలజీతో కలిపి ఈ మొండి ఘటాన్ని తయారు చేశారు. కేవలం చూడటానికే కాదు, పర్ఫార్మెన్స్‌లో కూడా ఇది ఒక బీస్ట్ అని చెప్పాలి. ఈ జీప్ ప్రాణం దాని ఇంజిన్‌లోనే ఉంది. ఇందులో భారీ 6.4 లీటర్ల HEMI V8 ఇంజిన్‌ను అమర్చారు. ఇది ఏకంగా 463.57 hp పవర్‌ను, 637.23 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. అంటే కొండలు, గుట్టలు, బురద ఏదైనా సరే.. దీని ముందు బలాదూర్ అన్నమాట. ప్రయాణంలో ఇంజిన్ శబ్దాన్ని మనకు నచ్చినట్లు అడ్జస్ట్ చేసుకునేందుకు ఇందులో డ్యూయల్ మోడ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా ఇచ్చారు. సిటీ రోడ్లపై హుందాగా, ఆఫ్-రోడ్ ట్రాక్‌లపై గర్జించే సింహంలా ఇది దూసుకుపోతుంది.
సాంకేతికంగా చూస్తే.. ఇది పక్కా ఆఫ్-రోడ్ మెషిన్. ఇందులో సెలెక్-ట్రాక్ ట్రాన్స్‌ఫర్ కేస్, డెనా 44 యాక్సిల్స్, ఎలక్ట్రానిక్ లాకింగ్ రియర్ డిఫరెన్షియల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి తోడు 35 ఇంచుల భారీ BF గూడ్రిచ్ టైర్లు, 17 ఇంచుల బీడ్‌లాక్ వీల్స్ ఈ వాహనానికి అదిరిపోయే గ్రిప్‌ను ఇస్తాయి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 282 ఎంఎం ఉండటం వల్ల ఎంతటి గతుకుల రోడ్డునైనా ఈజీగా దాటేస్తుంది. స్టీల్ బంపర్లు, విన్చ్-రెడీ సెటప్ దీనికి మరింత మొండితనాన్ని ఇచ్చాయి.
బయట నుంచి ఎంత మొరటుగా కనిపిస్తుందో, ఇంటీరియర్ అంత విలాసవంతంగా ఉంటుంది. నాపా లెదర్ సీట్లు, 12-వే పవర్ అడ్జస్టబుల్ ఆప్షన్, 12.3 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో ఉన్నాయి. మ్యూజిక్ లవర్స్ కోసం 9 స్పీకర్ల ఆల్పన్ సౌండ్ సిస్టమ్ అదిరిపోయే మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. జీప్ సీఈఓ బాబ్ బ్రోడర్‌డార్ఫ్ చెప్పినట్లుగా, క్లాసిక్ లుక్ తో పాటు విపరీతమైన పవర్ కోరుకునే వారికి ఈ విల్లీస్ 392 ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.