Kia : కియా మోటార్స్ భారీ ప్లాన్.. 2027 నాటికి మార్కెట్లోకి 4 సరికొత్త సూపర్ హిట్ ఎస్‌యూవీలు

2027 నాటికి మార్కెట్లోకి 4 సరికొత్త సూపర్ హిట్ ఎస్‌యూవీలు

Update: 2026-06-09 08:11 GMT

Kia : భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కియా ఇండియా రాబోయే రోజుల్లో మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమైంది. 2030 నాటికి తన కార్ల పోర్ట్‌ఫోలియోను 10 మోడళ్లకు పెంచాలని కంపెనీ ఒక పటిష్టమైన ప్రణాళికను ప్రకటించింది. ఇందులో విశేషం ఏంటంటే.. ఈ 10 కార్లలో ఏకంగా 8 మోడళ్లు ఎలక్ట్రిఫైడ్ టెక్నాలజీతో రాబోతున్నాయి. ఈ రోడ్ మ్యాప్‌లో భాగంగానే కియా సంస్థ 2027 నాటికి నాలుగు సరికొత్త ఎస్‌యూవీ కార్లను భారతీయ మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇందులో కియా సైరోస్ ఈవీ, సెల్టోస్ హైబ్రిడ్, సొరెంటో హైబ్రిడ్, నెక్స్ట్ జనరేషన్ సోనెట్ ఉన్నాయి.

అతి తక్కువ ధరలోనే కియా సైరోస్ ఈవీ

కియా ప్లాన్ ప్రకారం.. అందరికంటే ముందుగా కియా సైరోస్ ఈవీ కారు ఆగస్టు 2026లో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. భారత్‌లో కియా నుంచి రాబోతున్న అత్యంత చౌకైన, చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇదే కావడం విశేషం. ఇది మార్కెట్లో ఉన్న టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా XUV 3XO ఈవీ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రస్తుత పెట్రోల్-డీజిల్ సైరోస్ లుక్‌లోనే ఇది ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ వెర్షన్ కోసం ప్రత్యేకంగా ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, కొత్త డిజైన్ చార్జింగ్ పోర్ట్ వంటి మార్పులు చేయనున్నారు. ఇందులో 42kWh, 49kWh సామర్థ్యం గల రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది.

మరింత మైలేజ్‌తో కియా సెల్టోస్ హైబ్రిడ్

ఇక కియా లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కియా సెల్టోస్ హైబ్రిడ్ కారు 2027 ప్రారంభంలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ ఇప్పటికే అధికారికంగా ధృవీకరించింది. ప్రస్తుతానికి దీని ఇంజిన్ వివరాలను పూర్తిగా వెల్లడించనప్పటికీ, ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌కే స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను జోడించనున్నట్లు సమాచారం. ఈ కార్ ఎక్ట్సీరియర్ లుక్‌లో పెద్దగా మార్పులు ఉండకపోయినప్పటికీ, సరికొత్త హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా దీని మైలేజ్ మునుపటి కంటే అద్భుతంగా పెరుగుతుంది. పెట్రోల్ ఖర్చులను తగ్గించుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది.

పెద్ద ఫ్యామిలీల కోసం ప్రీమియం సొరెంటో

కియా నుంచి రాబోతున్న మూడో పెద్ద కారు కియా సొరెంటో హైబ్రిడ్. ఇది ఒక లగ్జరీ 7-సీటర్ ప్రీమియం ఎస్‌యూవీ. ఇది మార్కెట్లోకి వస్తే టాటా సఫారీ, మహీంద్రా XUV700, హ్యుందాయ్ అల్కజార్ వంటి పెద్ద కార్లకు గట్టి పోటీ ఎదురవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే పాపులర్ అయిన సొరెంటో కారులో 1.6 లీటర్ టర్బో పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్‌ను వాడుతున్నారు. ఇండియాలో కూడా ఇదే పవర్‌ట్రెయిన్‌తో తీసుకురావడానికి కియా మొగ్గు చూపుతోంది. పెద్ద కుటుంబాలు, సుదూర ప్రయాణాలు చేసేవారికి ఈ కారు ఒక లగ్జరీ ఫీలింగ్‌ను ఇస్తుంది.

కొత్త ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త కియా సోనెట్

వీటన్నింటితో పాటు, కియా తన బెస్ట్ సెల్లింగ్ కారు సోనెట్ ను సరికొత్త జనరేషన్ మోడల్‌గా 2027 లో లాంచ్ చేయబోతోంది. దీనికి కంపెనీ అంతర్గతంగా QY2E అనే కోడ్‌నేమ్ పెట్టింది. ఈ సరికొత్త సోనెట్ కారును పూర్తిగా సరికొత్త K1 ప్లాట్‌ఫామ్ పై తయారు చేయనున్నారు. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ వల్ల కారులో స్థలంతో పాటు భద్రత కూడా పెరుగుతుంది. అలాగే ఇందులో సరికొత్త ఓటీఏ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, రిమోట్ డయాగ్నోస్టిక్స్, అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ ఫీచర్లను అందించనున్నారు. మొత్తానికి కియా మోటార్స్ రాబోయే రెండేళ్లలో ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌ను రూల్ చేయడానికి పక్కా స్కెచ్‌తో వస్తోంది.

Tags:    

Similar News