KTM 160 Duke : కేటీఎం 160 డ్యూక్ కొత్త అవతార్.. రోడ్ల మీద మంటలు రేపడానికే వచ్చింది భయ్యా
రోడ్ల మీద మంటలు రేపడానికే వచ్చింది భయ్యా
KTM 160 Duke : యువత గుండెల్లో రైళ్లు పరిగెత్తించే స్పోర్ట్స్ బైక్ బ్రాండ్ కేటీఎం, మార్కెట్లోకి మరో పవర్‌ఫుల్ మెషీన్‌ను దింపింది. తన పాపులర్ మోడల్ కేటీఎం 160 డ్యూక్ లో సరికొత్త టాప్ మోడల్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ ధరను రూ.1.79 లక్షలుగా నిర్ణయించారు. కాగా, స్టాండర్డ్ వేరియంట్ రూ.1.71 లక్షలకు లభిస్తుంది. ఈ బైక్ ప్రధానంగా యమహా ఎంటీ-15కి గట్టి పోటీ ఇవ్వడమే లక్ష్యంగా మార్కెట్లోకి అడుగుపెట్టింది.
ఈ కొత్త టాప్ మోడల్‌లో ఉన్న స్పెషల్ ఏంటంటే.. ఇందులో 5-ఇంచుల టీఎఫ్‌టీ డిస్ప్లేను అమర్చారు. సాధారణంగా ఈ తరహా ప్రీమియం డిస్ప్లేను మనం కేటీఎం 390 డ్యూక్‌లో చూస్తుంటాం. ఈ స్క్రీన్ బ్లూటూత్ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల రైడర్లు తమ స్మార్ట్‌ఫోన్‌ను బైక్‌కు కనెక్ట్ చేసి కాల్స్, మ్యూజిక్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లను హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్‌ల ద్వారానే కంట్రోల్ చేయవచ్చు. ఎండలో కూడా స్పష్టంగా కనిపించేలా ఈ డిస్ప్లేను డిజైన్ చేశారు.
ఇక పవర్ విషయానికి వస్తే ఇందులో 164.2cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 19 PS పవర్, 15.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది తన ప్రత్యర్థి యమహా ఎంటీ-15 (18.4 PS పవర్) కంటే కొంచెం ఎక్కువే. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్.. అల్ట్రా లైట్ వెయిట్ డబ్ల్యూపీ యూఎస్‌డీ (WP USD) ఫోర్క్స్, బైబ్రే బ్రేక్స్, ఆఫ్‌రోడ్ ఏబీఎస్ (ABS) వంటి ఫీచర్లతో రైడింగ్ అనుభవాన్ని మరో లెవల్‌కు తీసుకెళ్తుంది. దీని ఇంజిన్ డిజైన్ కేటీఎం భారీ బైక్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ నుంచి ప్రేరణ పొందింది.
కేటీఎం 160 డ్యూక్ తన అగ్రెసివ్ లుక్‌తో యువతను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆగస్టులో లాంచ్ అయినప్పుడు దీని ధర కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, జీఎస్టీ సవరణల తర్వాత ఇప్పుడు అందుబాటు ధరలోకి వచ్చింది. ముఖ్యంగా కేటీఎం 125 డ్యూక్ ప్లేస్‌లో వచ్చిన ఈ 160 డ్యూక్, బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు కావాలనుకునే బైక్ లవర్స్‌కు బెస్ట్ ఆప్షన్. మీరు కూడా స్టైలిష్ అండ్ పవర్‌ఫుల్ బైక్ కోసం చూస్తుంటే, ఈ కొత్త టాప్ మోడల్‌ను ఒకసారి చెక్ చేయాల్సిందే!