Suzuki Access 125 vs Hero Destini 125: సుజుకి యాక్సెస్ vs హీరో డెస్టినీ..మైలేజీ యుద్ధంలో గెలిచేదెవరు?
మైలేజీ యుద్ధంలో గెలిచేదెవరు?
Suzuki Access 125 vs Hero Destini 125: భారతదేశంలో 125 సీసీ స్కూటర్ల హవా నడుస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇష్టమైన సుజుకి యాక్సెస్ 125, హీరో డెస్టినీ 125 మధ్య గట్టి పోటీ నెలకొంది. స్టైల్, మైలేజ్, నమ్మకానికి మారుపేరుగా ఉన్న ఈ రెండు స్కూటర్లలో ఏది కొంటే లాభం? ఏది మీ అవసరాలకు సరిపోతుంది? అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మొదట ధరల విషయానికి వస్తే, సుజుకి యాక్సెస్ 125 నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ.77,684 నుండి మొదలై టాప్ ఎండ్ వెర్షన్ రూ.93,877 వరకు ఉన్నాయి. మరోవైపు హీరో డెస్టినీ 125 బేస్ మోడల్ ధర రూ.83,997 ఉండగా, టాప్ మోడల్ రూ.84,919 గా ఉంది. అంటే యాక్సెస్ తో పోలిస్తే డెస్టినీ ప్రారంభ ధర కొంచెం ఎక్కువే అయినప్పటికీ, టాప్ మోడల్ మాత్రం యాక్సెస్ కంటే తక్కువ ధరకే లభిస్తోంది.
ఇంజిన్, పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే సుజుకి యాక్సెస్ 125 లో 124 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8.31 HP పవర్ , 10.2 Nm టార్క్‌ను ఇస్తుంది. అయితే హీరో డెస్టినీ 125 లో 124.6 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 9 HP పవర్, 10.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే పవర్ పరంగా హీరో డెస్టినీ కొంచెం ముందుందని చెప్పాలి. ఇక మైలేజీ విషయంలో హీరో డెస్టినీ అదరగొడుతోంది. సుజుకి యాక్సెస్ లీటరుకు 45 కిమీ ఇస్తుంటే, హీరో డెస్టినీ ఏకంగా 60 కిమీ మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
ఫీచర్ల విషయానికి వస్తే రెండూ ఒకదానికొకటి పోటీగా ఉన్నాయి. సుజుకి యాక్సెస్ లో బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ మీటర్, బయటి వైపు ఫ్యూయల్ క్యాప్ వంటివి ఉన్నాయి. హీరో డెస్టినీలో సెమీ డిజిటల్ కన్సోల్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ తో పాటు పెట్రోల్ ఆదా చేసే i3S టెక్నాలజీ (స్టార్ట్-స్టాప్ సిస్టమ్) ఉంది. మీకు పర్ఫార్మెన్స్, బ్రాండ్ వాల్యూ కావాలనుకుంటే సుజుకి యాక్సెస్ బెటర్. లేదు, తక్కువ ధరలో మంచి మైలేజీ, ఎక్కువ ఫీచర్లు కావాలనుకుంటే హీరో డెస్టినీ ఒక తెలివైన ఎంపిక అవుతుంది.