Car Loan : క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే కారు కల కలే..అయితే ఇలా కాపాడుకోండి
అయితే ఇలా కాపాడుకోండి
Car Loan : సొంత కారు అనేది ప్రతి ఒక్కరి కల. కానీ ఆ కల నిజం కావాలంటే కేవలం డబ్బు ఉంటే సరిపోదు, మీ క్రెడిట్ స్కోర్ కూడా బాగుండాలి. నేటి కాలంలో మీరు కొత్త కారు కొన్నా, లీజుకు తీసుకున్నా లేదా ఇన్సూరెన్స్ చేయించినా.. అన్నింటికీ ఆధారం మీ క్రెడిట్ ప్రొఫైలే. మంచి స్కోర్ ఉంటే బ్యాంకులు మీకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతాయి. అదే స్కోర్ తక్కువగా ఉంటే మాత్రం, కారు ఇంటికి రావడానికి ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అసలు క్రెడిట్ స్కోర్ మీ కారు కొనుగోలుపై ఎంతటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు చూద్దాం.
మీ కారు లోన్ త్వరగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా మంజూరు కావాలంటే మీ క్రెడిట్ స్కోర్ కీలకం. సాధారణంగా 750 అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు వెంటనే లోన్ ఇచ్చేస్తాయి. అంతేకాదు మీకు తక్కువ వడ్డీ రేటు కూడా లభిస్తుంది. అదే స్కోర్ తక్కువగా ఉంటే, అదనపు డాక్యుమెంట్లు అడగడం, ఎవరో ఒకరిని హామీదారుగా చేర్చమని చెప్పడం లేదా భారీ మొత్తంలో డౌన్ పేమెంట్ కట్టమని వేధించడం వంటివి జరుగుతాయి. అంటే తక్కువ స్కోర్ ఉంటే లోన్ దొరకదు అని కాదు కానీ, ప్రాసెస్ మాత్రం చాలా కష్టతరం అవుతుంది.
వడ్డీ రేటు విషయంలో క్రెడిట్ స్కోర్ పాత్ర చాలా పెద్దది. మంచి స్కోర్ ఉన్న వారికి తక్కువ వడ్డీ పడటం వల్ల, లోన్ కాలపరిమితి ముగిసే సరికి లక్షల రూపాయలు ఆదా అవుతాయి. అదే స్కోర్ బాగోలేకపోతే బ్యాంకులు రిస్క్ ఫీజు కింద ఎక్కువ వడ్డీ వసూలు చేస్తాయి. దీనివల్ల మీరు కొన్న కారు దాని అసలు ధర కంటే చాలా ఎక్కువ భారాన్ని మోపుతుంది. బలమైన క్రెడిట్ ప్రొఫైల్ ఉంటే మీరు బ్యాంకులతో బేరసారాలు ఆడి మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఎక్కువ లోన్ మొత్తం, తక్కువ ప్రాసెసింగ్ ఫీజు వంటి ఆఫర్లు మీ సొంతమవుతాయి.
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, కారు ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీ ఇచ్చే ముందు మీ క్రెడిట్ హిస్టరీని పరిశీలిస్తాయి. మీరు అప్పులు సకాలంలో చెల్లిస్తున్నారా లేదా అనే దాన్ని బట్టి మీ రిస్క్ లెవల్‌ను అంచనా వేస్తాయి. మంచి స్కోర్ ఉంటే మీ డ్రైవింగ్ రికార్డ్ ఎలా ఉన్నా ప్రీమియం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కారును లీజుకు తీసుకోవాలన్నా మంచి స్కోర్ ఉంటేనే నెలవారీ వాయిదాలు తక్కువగా ఉంటాయి. వెరసి, మంచి క్రెడిట్ స్కోర్ అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు.. అది కారు కొనుగోలులో మీకు లక్షల రూపాయలు ఆదా చేసే అస్త్రం.