Mahindra: మహీంద్రా కార్ల లవర్లకు షాక్.. భారీగా పెరిగిన బోలెరో నియో ధర
బోలెరో నియో ధర
Mahindra:ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా తన కస్టమర్లకు మరోసారి చిన్నపాటి షాక్ ఇచ్చింది. కంపెనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన అఫోర్డబుల్ ఎస్యూవీ బోలెరో నియో ధరలను తాజాగా పెంచినట్లు ప్రకటించింది. అక్టోబర్ 2026 నెలకి సంబంధించి విడుదలైన కొత్త ప్రైస్ లిస్ట్ ప్రకారం, ఈ పాపులర్ ఎస్యూవీ వివిధ వేరియంట్లపై రూ.9,000 వరకు ధరలను సవరించారు. అయితే అన్ని మోడళ్లపై ధరలు పెరగలేదు, కొన్నింటిపై స్వల్పంగా పెరిగితే, మరొక మోడల్ ధర తగ్గడం విశేషం. ఈ తాజా ధరల సవరణతో బోలెరో నియో ప్రాథమిక ప్రారంభ ధర ఇప్పుడు రూ.9.06 లక్షలకు చేరుకుంది.
ఏయే వేరియంట్ ఎంత పెరిగింది ?
ఈ ధరల పెంపులో భాగంగా బోలెరో నియో ఎంట్రీ-లెవల్ మోడల్ అయిన N4 డీజిల్ టర్బో మాన్యువల్ వేరియంట్ ధర రూ.7,000 పెరిగి రూ.9.06 లక్షలకు చేరింది. అలాగే మిడ్-రేంజ్ N11 డీజిల్ టర్బో మాన్యువల్ వేరియంట్ రూ.9,000 పెరిగి కొత్త ధర రూ.10.39 లక్షలుగా ఉంది. టాప్-ఎండ్ వేరియంట్ అయిన N10 (O) డీజిల్ మాన్యువల్ ధర కూడా రూ.6,000 పెరిగి రూ.10.85 లక్షలకు చేరింది. అయితే N8 వేరియంట్ ధరలో ఎలాంటి మార్పు చేయకుండా పాత ధర రూ.9.69 లక్షల వద్దే కొనసాగిస్తున్నారు. మరోవైపు N10 (R) డీజిల్ మాన్యువల్ వేరియంట్ కొనుగోలుదారులకు ఊరటనిస్తూ సుమారు రూ.9,102 తగ్గి రూ.9,99,898కి లభిస్తోంది.
స్కార్పియో క్లాసిక్ ధరలలో కూడా పెరుగుదల
గత వారం వెలువడిన నివేదికల ప్రకారం మహీంద్రా తన మరో ప్రముఖ మోడల్ అయిన స్కార్పియో క్లాసిక్ ధరలను కూడా పెంచిన సంగతి తెలిసిందే. ఈ ఎస్యూవీ ధరలు రూ.8,500 వరకు పెరిగాయి. దీనితో స్కార్పియో క్లాసిక్ ఎక్స్ షోరూమ్ ధరలు రూ.13.43 లక్షల నుంచి రూ.17.48 లక్షల మధ్య ఉన్నాయి. ముఖ్యంగా S11 డీజిల్ మాన్యువల్ 7-సీటర్ వేరియంట్ పై రూ.8,500, S డీజిల్ మాన్యువల్ 9-సీటర్ వేరియంట్ పై రూ.7,000 అలాగే S డీజిల్ మాన్యువల్ 7-సీటర్ వేరియంట్ పై రూ.6,500 వరకు ధరలు పెరిగాయి.
కారు కొనుగోలుదారులు గమనించాల్సిన విషయాలు
మహీంద్రా కార్ల ధరలు వరుసగా మారుతుండటంతో, కొత్తగా ఎస్యూవీ కొనుగోలు చేయాలని భావించేవారు షోరూమ్‌లను సందర్శించడం చాలా ముఖ్యం. బుకింగ్స్ చేసుకునే ముందు మీ సమీపంలోని అధీకృత మహీంద్రా డీలర్‌ను సంప్రదించి, తాజా ఆన్-రోడ్ అలాగే ఎక్స్ షోరూం ధరలను కచ్చితంగా ధృవీకరించుకోవడం మంచిది. ప్రాంతాలను బట్టి పన్నులు, ఇతర ఛార్జీల్లో తేడాలు ఉండే అవకాశం ఉన్నందున ముందుగా సరైన బడ్జెట్ అంచనా వేసుకోవడం ఎంతో అవసరం.