Mahindra: మహీంద్రా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఒక్కో SUVపై రూ.1.5 లక్షల వరకు తగ్గింపు
ఒక్కో SUVపై రూ.1.5 లక్షల వరకు తగ్గింపు
Mahindra: పండుగల సీజన్లో కొత్త ఎస్‌యూవీని సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్ల కోసం ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్ 2026 నెలలో తన పాపులర్ కార్లయిన ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, స్కార్పియో క్లాసిక్ అలాగే స్కార్పియో ఎన్ మోడళ్లపై ప్రత్యేక డీల్స్‌ను తీసుకువచ్చింది. ఈ ఆఫర్ల ద్వారా క్యాష్ డిస్కౌంట్ తో పాటు ఉచిత యాక్సెసరీస్ కూడా లభిస్తున్నాయి. వివిధ మోడళ్లు అలాగే వేరియంట్ల ఆధారంగా ఈ డిస్కౌంట్లు మారుతుంటాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఆఫర్లు
ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ పెట్రోల్ అలాగే డీజిల్ వేరియంట్లపై కంపెనీ విభిన్న రకాల రాయితీలను అందిస్తోంది. ముఖ్యంగా MX2 Pro, MX3 అలాగే MX3 Pro పెట్రోల్ మోడళ్లను కొనుగోలు చేసే వారికి రూ.40,000 వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. దీనికి తోడు రూ.20,000 విలువైన ఉచిత యాక్సెసరీస్ కూడా ఇస్తున్నారు. మొత్తంగా ఈ పెట్రోల్ వేరియంట్లపై రూ.60,000 వరకు ఆదా చేసుకోవచ్చు. మరోవైపు డీజిల్ వేరియంట్లపై రూ.10,000 నగదు తగ్గింపు అలాగే రూ.15,000 విలువైన యాక్సెసరీస్ కలుపుకుని మొత్తం రూ.25,000 వరకు ప్రయోజనం పొందవచ్చు.
స్కార్పియో క్లాసిక్ మోడల్‌పై ప్రత్యేక తగ్గింపు
మహీంద్రా స్కార్పియో క్లాసిక్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ పండుగ సీజన్ ఎంతో అనుకూలంగా ఉంది. దీని ఎస్ (S) వేరియంట్ కొనుగోలుపై రూ.15,000 క్యాష్ డిస్కౌంట్ తో పాటు రూ.20,000 విలువైన యాక్సెసరీస్ లభిస్తాయి. తద్వారా ఈ మోడల్‌పై మొత్తం రూ.35,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇక దీనికంటే మెరుగైన ఎస్11 (S11) వేరియంట్‌పై రూ.25,000 నగదు తగ్గింపు అలాగే రూ.20,000 ఉచిత యాక్సెసరీస్ అందిస్తున్నారు. దీనివల్ల ఈ మోడల్ కొనుగోలు చేసేవారికి రూ.45,000 వరకు ప్రయోజనం దక్కుతుంది.
స్కార్పియో ఎన్ మోడల్‌పై రూ.1.5 లక్షల వరకు ఆదా
మహీంద్రా ఎస్‌యూవీల ఆఫర్లలో అత్యధికంగా చర్చనీయాంశంగా మారిన మోడల్ స్కార్పియో ఎన్ Z8L 7-Seater 4WD AT. ఈ టాప్-ఎండ్ మోడల్‌పై కంపెనీ ఏకంగా రూ. 1.25 లక్షల క్యాష్ డిస్కౌంట్ ఇస్తోంది. దీనికి అదనంగా రూ. 25,000 విలువైన యాక్సెసరీస్ ప్యాకేజీ లభిస్తుంది. ఇవన్నీ కలుపుకుంటే వినియోగదారులకు మొత్తం రూ. 1.5 లక్షల వరకు భారీ తగ్గింపు లభిస్తుంది. అలాగే దీని సాధారణ 2WD AT వేరియంట్లపై రూ. 50,000 నగదు తగ్గింపుతో పాటు రూ. 25,000 యాక్సెసరీస్ లభించి మొత్తం రూ. 75,000 వరకు లాభం పొందవచ్చు. డీలర్షిప్ ప్రాంతాన్ని బట్టి ఆఫర్లలో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున కొనుగోలుదారులు ముందుగా సమీపంలోని షోరూమ్‌ను సంప్రదించడం మంచిది.