Mahindra : ఇండియాలో మహింద్రా సునామీ మే నెలలో లక్షకు చేరిన అమ్మకాలు
మే నెలలో లక్షకు చేరిన అమ్మకాలు
Mahindra : భారత ఆటోమొబైల్ మార్కెట్లో స్వదేశీ దిగ్గజం మహింద్రా అండ్ మహింద్రా సరికొత్త రికార్డులతో దుమ్మురేపుతోంది. తాజాగా విడుదలైన మే 2026 సేల్స్ రిపోర్ట్ ప్రకారం.. కంపెనీ ఏకంగా 20 శాతం వృద్ధితో దాదాపు లక్ష వాహనాలను విక్రయించి సంచలనం సృష్టించింది. ఎస్‌యూవీలతో పాటు త్రీ-వీలర్స్, కమర్షియల్ వాహనాలు మరియు ట్రాక్టర్ల అమ్మకాల్లోనూ మహింద్రా బంపర్ హిట్ కొట్టింది. మహింద్రా కంపెనీ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. మే 2026 నెలలో ఎగుమతులతో కలుపుకుని కంపెనీ మొత్తం 99,636 వాహనాలను విక్రయించింది. గత ఏడాది మే 2025 తో పోల్చి చూస్తే కంపెనీ మొత్తం అమ్మకాల్లో ఏకంగా 20 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. ముఖ్యంగా మహింద్రాకు చెందిన పవర్‌ఫుల్ ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియో మార్కెట్లో తిరుగులేని ప్రదర్శన కనబరుస్తూ ఈ రికార్డు సాధించడంలో కీలక పాత్ర పోషించింది.
ప్రస్తుతం మహింద్రా కేవలం ఎస్‌యూవీ మోడల్స్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టింది. మే 2026 లో కంపెనీ కేవలం భారతీయ మార్కెట్లోనే 58,021 ఎస్‌యూవీలను విక్రయించింది. గతేడాది మే 2025 లో జరిగిన 52,431 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ. ఇక విదేశీ ఎగుమతులను కూడా కలిపితే మొత్తం ఎస్‌యూవీ సేల్స్ సంఖ్య 59,573 కి చేరింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో (ఏప్రిల్-మే 2026) కంపెనీ మొత్తం 1,14,352 ప్యాసింజర్ వాహనాలను అమ్మి 9 శాతం వృద్ధి సాధించింది. ఈసారి మహింద్రా సేల్స్ రిపోర్ట్‌లో అత్యంత అద్భుతమైన ప్రదర్శన త్రీ-వీలర్ విభాగంలో కనిపించింది. ఎలక్ట్రిక్ వేరియంట్లతో కలుపుకుని మహింద్రా మే నెలలో మొత్తం 12,536 త్రీ-వీలర్లను విక్రయించింది. గతేడాది మే నెలలో జరిగిన 6,635 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది ఏకంగా 89 శాతం భారీ వృద్ధి కావడం విశేషం. అలాగే కమర్షియల్ వాహనాల విభాగంలోనూ 2 టన్నుల లోపు వాహనాలు 35 శాతం, భారీ వాహనాలు 16 శాతం మేర వృద్ధిని సాధించాయి.
కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ మహింద్రా వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. మే 2026 లో కంపెనీ మొత్తం 5,000 వాహనాలను విదేశీ మార్కెట్లకు విజయవంతంగా ఎగుమతి చేసింది. గతేడాది మే నెలలో జరిగిన 3,646 యూనిట్ల ఎగుమతులతో పోలిస్తే ఇది 37 శాతం ప్రగతిని చూపిస్తోంది. రెండు నెలల (ఏప్రిల్-మే) మొత్తం ఎగుమతులు 9,970 యూనిట్లకు చేరి 42 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కంపెనీ ఆటోమోటివ్ డివిజన్ సీఈఓ (CEO) నలినికాంత్ గొలగుంట మాట్లాడుతూ.. మార్కెట్లో మహింద్రా వాహనాలకు డిమాండ్ చాలా బలంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అయితే, కొందరు సప్లయర్ల వద్ద ఉద్యోగుల కొరత కారణంగా సప్లై చైన్‌లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ కొత్త ఆర్థిక సంవత్సరానికి తాము అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చామని ధీమా వ్యక్తం చేశారు.
వాహన రంగంలోనే కాకుండా వ్యవసాయ రంగంలోనూ మహింద్రా ట్రాక్టర్లు సరికొత్త రికార్డు సృష్టించాయి. మే 2026 లో కంపెనీ దేశీయంగా ఏకంగా 47,845 ట్రాక్టర్లను విక్రయించి 23 శాతం వార్షిక వృద్ధిని సొంతం చేసుకుంది. విదేశీ ఎగుమతులైన 1,850 ట్రాక్టర్లను కూడా కలుపుకుంటే మే నెలలో మహింద్రా మొత్తం ట్రాక్టర్ల అమ్మకాలు 49,695 యూనిట్లకు చేరి గ్రామీణ మార్కెట్లో తన తిరుగులేని పట్టును నిరూపించుకున్నాయి.