Maruti Suzuki : స్విఫ్ట్, బ్రెజ్జా హవా.. భారత ఆటోమొబైల్ హిస్టరీలోనే మారుతి ఆల్‌టైమ్ రికార్డ్
భారత ఆటోమొబైల్ హిస్టరీలోనే మారుతి ఆల్‌టైమ్ రికార్డ్
Maruti Suzuki : భారతీయ కార్ల మార్కెట్ రారాజు మారుతి సుజుకి మే 2026 నెలలో సరికొత్త చరిత్ర సృష్టించింది. తన ప్యాసింజర్ కార్లు, ఎస్‌యూవీల బలంతో కంపెనీ తన చరిత్రలోనే అత్యుత్తమ మంత్లీ సేల్స్ రికార్డును నమోదు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మే నెలలో పాత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ మారుతి కార్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. మారుతి సుజుకి విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం.. మే 2026 లో కంపెనీ మొత్తం 2,42,688 వాహనాలను విక్రయించింది. గత ఏడాది మే 2025 లో జరిగిన 1,80,077 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే.. ఈసారి ఏకంగా 34.8 శాతం అద్భుతమైన వార్షిక వృద్ధి నమోదైంది. మారుతి సుజుకి చరిత్రలో ఒకే నెలలో ఇంత పెద్ద మొత్తంలో కార్లు అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
మన దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందో ఈ గణాంకాలు చెబుతున్నాయి. కేవలం ఇండియాలోనే మే 2026 లో కంపెనీ 1,90,337 ప్యాసింజర్ వాహనాల దేశీయ విక్రయాలను సాధించింది. గతేడాది మే నెలలో అమ్ముడైన 1,35,962 యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 40 శాతం భారీ గ్రోత్. ఇక కమర్షియల్ వాహనాలు, ఓఈఎమ్ సప్లైని కూడా కలిపితే మొత్తం దేశీయ విక్రయాల సంఖ్య 2,00,774 యూనిట్లకు చేరింది. మారుతి సుజుకి సాధించిన ఈ అసాధారణ వృద్ధికి ప్రధాన కారణం కంపెనీకి చెందిన యుటిలిటీ వాహనాల విభాగమేనని చెప్పాలి. ప్రస్తుతం మార్కెట్లో ట్రెండ్ అవుతున్న బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్, ఎర్టిగా, ఈ-విటారా, ఇన్విక్టో, జిమ్నీ, ఎక్స్‌ఎల్6 వంటి ఎస్‌యూవీ, ఎమ్పీవీ మోడల్స్ కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తూ సేల్స్ పెంచేలా చేశాయి.
కాంపాక్ట్, హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతి సుజుకికి ఎదురేలేకుండా పోయింది. అందరి ఫేవరెట్ అయిన స్విఫ్ట్, బాలెనోలతో పాటు వ్యాగన్ఆర్, డిజైర్, సెలెరియో, ఇగ్నిస్, సియాజ్ వంటి కార్లు కలిసి మే 2026 లో ఏకంగా 97,830 యూనిట్ల అమ్మకాలను జరిపాయి. గతేడాది ఇదే విభాగంలో 68,736 కార్లు అమ్ముడయ్యాయి. ఇవే కాకుండా ఎంట్రీ లెవెల్ కార్లయిన ఆల్టో, ఎస్-ప్రెస్సోలు కలిసి 16,275 యూనిట్లు, మారుతి ఈకో వ్యాన్ 13,240 యూనిట్ల మేర అమ్ముడయ్యాయి. కేవలం భారతదేశంలోనే కాదు, విదేశీ మార్కెట్లలోనూ మారుతి సుజుకి కార్లు దుమ్మురేపుతున్నాయి. మే 2026 నెలలో కంపెనీ మొత్తం 41,914 కార్లను విదేశాలకు విజయవంతంగా ఎగుమతి చేసింది. గతేడాది మే 2025 లో జరిగిన 31,219 యూనిట్ల ఎగుమతులతో పోలిస్తే ఇది 34.3 శాతం భారీ పెరుగుదలను సూచిస్తోంది. దీన్ని బట్టి గ్లోబల్ మార్కెట్లోనూ మారుతి బ్రాండ్ ఇమేజ్ క్రమంగా బలపడుతోందని స్పష్టమవుతోంది.
కొత్త ఆర్థిక సంవత్సరం (FY2026-27) మొదటి రెండు నెలల్లోనే (ఏప్రిల్-మే) మారుతి సుజుకి మొత్తం 4,82,334 వాహనాలను విక్రయించి ఘనమైన ఆరంభాన్ని ఇచ్చింది. ఇందులో దేశీయ విక్రయాలు 3,78,041 యూనిట్లు కాగా, ఎగుమతుల వాటా 81,968 యూనిట్లుగా ఉంది. హ్యాచ్‌బ్యాక్, సెడాన్, ఎస్‌యూవీ.. ఇలా అన్ని విభాగాల్లోనూ మారుతి సుజుకి తన ఏకఛత్రాధిపత్యాన్ని నిరూపించుకుంటూ దూసుకుపోతోంది.