Maruti Suzuki: కొత్త కారు కొనాలనుకునేవారికి పండుగే.. మారుతి సుజుకీ కార్ల పై రూ.1.55 లక్షల తగ్గింపు
మారుతి సుజుకీ కార్ల పై రూ.1.55 లక్షల తగ్గింపు
Maruti Suzuki: సొంత కారు కల నెరవేర్చుకోవాలనుకునే వాహనప్రియులకు మారుతి సుజుకి అదిరిపోయే తీపి కబురు అందించింది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన అధునాతన నెక్సా ఫ్రాంచైజీ కార్లపై అసాధారణ రీతిలో డిస్కౌంట్లను ప్రకటించింది. ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్, పాత కారు మార్పిడిపై ఇచ్చే ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ ఇన్సెంటివ్స్, కార్పొరేట్ ఆఫర్లను ఒకే గొడుగు కిందకు తెచ్చి కస్టమర్ల జేబుకు పెద్ద ఊరట కల్పించింది. షోరూమ్లలో లభించే ఆఫర్లు నగరాలు, డీలర్లు, స్టాక్ లభ్యతను బట్టి కొంత మారే అవకాశం ఉన్నప్పటికీ, గత కొద్ది కాలంలో ఇదే బెస్ట్ డీల్ అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
ప్రీమియం ఎంపీవీ ఇన్విక్టో, గ్రాండ్ విటారాలపై భారీ ఆఫర్లు
మారుతి సుజుకి ఫ్లాగ్‌షిప్ మోడల్ ఇన్విక్టో కొనుగోలుపై అత్యధికంగా రూ.1.55 లక్షల వరకు ప్రయోజనం పొందే వెసులుబాటు కలగనుంది. ఇందులో రూ.55,000 నేరుగా నగదు తగ్గింపుకాగా, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.50,000, లాయల్టీ బోనస్ రూపంలో రూ.30,000 లభిస్తాయి. ఇక పాపులర్ ఎస్‌యూవీ గ్రాండ్ విటారా పెట్రోల్ మోడళ్లపై రూ.1.30 లక్షల వరకు ఆఫర్లు లభిస్తున్నాయి. స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ ఎంచుకునే వారికి రూ.1.25 లక్షల తగ్గింపుతో పాటు 5 ఏళ్ల విస్తరించిన వారంటీని ఉచితంగా ఇస్తున్నారు. సీఎన్‌జీ వేరియంట్‌పై సైతం రూ.1.05 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.
జిమ్నీ, ఎక్స్ఎల్6, బలేనో కార్లపై ప్రత్యేక రాయితీలు
సాహసోపేతమైన ఆఫ్ రోడింగ్ ఇష్టపడే వారి కోసం లభిస్తున్న జిమ్నీ ఎస్‌యూవీ అన్ని వేరియంట్లపై రూ.35,000 ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఆరు సీట్ల ప్రీమియం ఫ్యామిలీ కారు ఎక్స్ఎల్6 పై పెట్రోల్, సీఎన్‌జీ వెర్షన్లు రెండింటిపైనా రూ.50,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఎంతో ఆదరణ పొందిన బలేనో హ్యాచ్‌బ్యాక్ కొనుగోలుపై రూ.30,000 వరకు, కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్ టర్బో వేరియంట్‌పై రూ.20,000 వరకు ఆఫర్లు పొందవచ్చు.