Maruti : విదేశాల్లో మార్మోగుతున్న మారుతి పేరు.. కార్ల ఎగుమతుల్లో దుమ్ములేపుతున్న విటారా

కార్ల ఎగుమతుల్లో దుమ్ములేపుతున్న విటారా

Update: 2025-10-06 05:17 GMT

 Maruti : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రస్తుతం దేశీయ మార్కెట్‌తో పాటు విదేశీ మార్కెట్‌ మీద పూర్తిగా దృష్టి పెట్టింది. రాబోయే ఆర్థిక సంవత్సరం 2025-26లో ఏకంగా 4 లక్షలకు పైగా కార్లను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం దిశగా కంపెనీ వేగంగా ముందుకు కదులుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఆరు నెలల కాలంలోనే మారుతి 2 లక్షలకు పైగా కార్లను విదేశాలకు పంపింది.

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ కేవలం సెప్టెంబర్ 2025 నెలలోనే 42,204 కార్లను ఎగుమతి చేసింది. ఇది గత ఏడాది సెప్టెంబర్ (27,728 యూనిట్లు)తో పోలిస్తే 52% వృద్ధిని సూచిస్తోంది. మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి ఈ వివరాలు వెల్లడించారు. మొదటి త్రైమాసికంలో దాదాపు 1.10 లక్షల యూనిట్లు, ఆరు నెలల కాలంలో 2.07 లక్షలకు పైగా యూనిట్లను ఎగుమతి చేశామని, 4 లక్షల యూనిట్ల లక్ష్యాన్ని చేరుకునే దిశగా సరైన మార్గంలో ఉన్నామని ఆయన తెలిపారు.

ఎగుమతుల విషయంలో మారుతి సుజుకి దేశంలో రెండవ అతిపెద్ద కంపెనీ కంటే రెట్టింపు కార్లను ఎగుమతి చేస్తుందని రాహుల్ భారతి తెలిపారు. దేశీయ మార్కెట్‌లో ఎలాగైతే మారుతికి బలమైన పట్టు ఉందో, విదేశీ మార్కెట్లలో కూడా కంపెనీ పట్టు క్రమంగా పెరుగుతోంది. "నాలుగేళ్ల క్రితం మేము సంవత్సరానికి లక్ష కార్లు ఎగుమతి చేస్తే, ఇప్పుడు కేవలం రెండవ త్రైమాసికంలోనే లక్షకు పైగా యూనిట్లు పంపాము" అని ఆయన చెప్పారు. 2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కేవలం 96,139 యూనిట్లు మాత్రమే ఎగుమతి చేసింది.

మారుతి కేవలం సాధారణ కార్లే కాకుండా, తమ ఎలక్ట్రిక్ కారు ఇ విటారాను కూడా విదేశాలకు పంపిస్తోంది. ఆగస్టు, సెప్టెంబర్ 2025 నెలల్లో కంపెనీ ఏకంగా 6,068 ఇ విటారా యూనిట్లను ఎగుమతి చేసింది. "ఇది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఒక స్ట్రాంగ్ మెసేజ్. భారతదేశంలో తయారైన కార్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి" అని భారతి అన్నారు. విదేశాలతో భారత ప్రభుత్వం చేసుకున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు కూడా ఎగుమతులు పెరగడానికి దోహదపడ్డాయని ఆయన తెలిపారు.

2026 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో మారుతి నుంచి ఎక్కువగా ఎగుమతి అయిన కార్లలో Fronx, Jimny, Swift, Baleno, Dzire ఉన్నాయి. మారుతి సుజుకికి దక్షిణాఫ్రికా, జపాన్, సౌదీ అరేబియా, చిలీ, కొలంబియా అతిపెద్ద విదేశీ మార్కెట్లుగా నిలిచాయి.

Tags:    

Similar News