MG Motors : ఎంజీ మోటార్స్ భారీ షాక్.. రూ.5 లక్షల వరకు పెరిగిన లగ్జరీ కార్ల ధరలు.. కొత్త రేట్లు ఇవే
కొత్త రేట్లు ఇవే
MG Motors : భారతదేశంలో లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న JSW MG మోటార్ ఇండియా, తన ప్రీమియం కస్టమర్లకు షాక్ ఇచ్చింది. కంపెనీ తన అత్యంత విలాసవంతమైన మోడల్స్ అయిన MG M9 ఎలక్ట్రిక్ ఎంపీవీ, స్పోర్టీ ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ ఎంజీ సైబర్‌స్టర్ ధరలను భారీగా పెంచింది. తయారీ ఖర్చులు పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని కంపెనీ స్పష్టం చేసింది. ఏప్రిల్ 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త ధరలు, ఈ కార్లను మరింత ఖరీదైనవిగా మార్చేశాయి.
ఎంజీ సంస్థ నుంచి వచ్చిన అత్యంత విలాసవంతమైన 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీ MG M9 ధర ఏకంగా రూ.5 లక్షలు పెరిగింది. దీంతో ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ.75.90 లక్షలకు చేరింది. కేవలం ఒకే వేరియంట్‌లో లభించే ఈ కారులో 90 kWh భారీ బ్యాటరీ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 548 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. లోపల వెంటేలేటెడ్ మసాజ్ సీట్లు, డ్యూయల్ పాన్ సన్‌రూఫ్, 13 స్పీకర్ల ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కియా కార్నివాల్ వంటి కార్లకు ఇది గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ, ధర పెరగడం వల్ల ఇప్పుడు మరింత ప్రీమియంగా మారింది.
వేగాన్ని అమితంగా ఇష్టపడే వారి కోసం రూపొందించిన ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ ఎంజీ సైబర్‌స్టర్ ధర కూడా రూ.2.50 లక్షలు పెరిగింది. ఇప్పుడు దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.77.49 లక్షల వద్ద ఉంది. ఈ కారు కేవలం 3.2 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. 528 bhp పవర్, 725 Nm టార్క్ ఉత్పత్తి చేసే దీని 77 kWh బ్యాటరీ, ఒక్క ఛార్జ్‌పై 580 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్‌తో వచ్చే ఈ స్పోర్ట్స్ కారుకు మార్కెట్లో తనదైన క్రేజ్ ఉంది.
ఎక్కడ లభిస్తాయి? ఎందుకు పెరిగాయి?
ఈ రెండు మోడల్స్ కూడా సాధారణ డీలర్‌షిప్స్‌లో లభించవు. కేవలం కంపెనీకి చెందిన ప్రత్యేకమైన ఎంజీ సెలెక్ట్ డీలర్‌షిప్స్ ద్వారా మాత్రమే వీటిని విక్రయిస్తారు. అంతర్జాతీయ మార్కెట్‌లో విడిభాగాల ధరలు పెరగడం, షిప్పింగ్ ఛార్జీలు, ఇన్పుట్ ఖర్చులు అధికం కావడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. 2026 ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చిన ఈ నిర్ణయం వల్ల, హై-ఎండ్ ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుదారులపై అదనపు భారం పడనుంది.
ధరలు పెరిగినప్పటికీ, ఎంజీ మోటార్స్ తన నెట్‌వర్క్‌ను భారత్‌లో మరింత విస్తరించే పనిలో ఉంది. రాబోయే నెలల్లో మహీంద్రా మరియు ఇతర కంపెనీల నుంచి మరిన్ని 4×4 ఎస్‌యూవీలు రాబోతున్న తరుణంలో, ఎంజీ కూడా తన లైనప్‌ను అప్‌డేట్ చేస్తోంది. త్వరలోనే మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ వంటి కార్లు కూడా మార్కెట్లోకి రాబోతుండటంతో, ప్రీమియం సెగ్మెంట్లో తన పట్టును నిలుపుకోవడానికి MG ఈ ధరల సవరణ చేసింది. తమ కస్టమర్లకు అత్యుత్తమ సేవలందించడానికి తాము ఎప్పుడూ సిద్ధమని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.