MG Motor : భారత్‌లో MG ఎలక్ట్రిక్ కార్ల జాతర.. త్వరలో 4 సరికొత్త మోడల్స్ లాంచ్

త్వరలో 4 సరికొత్త మోడల్స్ లాంచ్

Update: 2026-04-29 12:24 GMT

MG Motor : భారతీయ రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాల జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ రేసులో దూసుకుపోవడానికి JSW MG మోటార్ ఇండియా నడుం బిగించింది. ప్రతి 3 నుండి 6 నెలలకు ఒక కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్న ఈ కంపెనీ, త్వరలో వరుసగా నాలుగు సరికొత్త ఎలక్ట్రిక్, హైబ్రిడ్ ఎస్‌యూవీలను రంగంలోకి దించుతోంది. పెట్రోల్, డీజిల్ కార్లకు గట్టి పోటీనిస్తూ, అత్యాధునిక టెక్నాలజీ, భారీ పవర్‌తో ఈ కార్లు రాబోతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

1. MG S5

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న MG ZS EV స్థానంలో ఈ కొత్త MG S5 రాబోతోంది. ఇది చూడటానికి ZS EV కంటే చాలా ప్రీమియం గా, స్టైలిష్ గా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్ లైట్లు, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ ప్రధాన ఆకర్షణ. లోపల 12.8 ఇంచుల భారీ టచ్ స్క్రీన్, వైర్ లెస్ ఛార్జింగ్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. ఇది 49 kWh, 64 kWh బ్యాటరీ ఆప్షన్లతో రానుంది, అంటే ఒక్క ఛార్జ్ తో భారీ రేంజ్ ని ఆశించవచ్చు.

2. MG స్టార్‌లైట్ 560

ఎంజీ నుంచి వస్తున్న మొట్టమొదటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) కారు ఇది. ఇది నేరుగా మహీంద్రా XUV700 కు పోటీనివ్వనుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 20.5 kWh బ్యాటరీ ఉంటుంది. అంటే దీనిని ఎలక్ట్రిక్ కారులా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అలాగే పెట్రోల్ తోనూ నడపవచ్చు. ఇది 7-సీటర్ వేరియంట్ లో రాబోతుండటంతో పెద్ద కుటుంబాలకు ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

3. MG స్టార్‌లైట్ 560 EV

హైబ్రిడ్ వెర్షన్ తో పాటు దీనిని పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ (EV) మోడల్ లో కూడా MG లాంచ్ చేయబోతోంది. ఇందులో 56.7 kWh భారీ బ్యాటరీ ఉంటుంది, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 136 bhp పవర్ తో నడిచే ఈ కారు సైలెంట్ గానే కాకుండా చాలా పవర్ ఫుల్ గా పరుగెడుతుంది. దీనిని కూడా 7-సీటర్ గానే ఇండియాలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

4. MG iM6

ఈ ఏడాది MG నుంచి రాబోతున్న అత్యంత ప్రీమియం కారు ఇదే. ఇది హ్యుందాయ్ అయోనిక్ 5, కియా EV6 వంటి కార్లకు సవాల్ విసరనుంది. ఇందులో AWD (ఆల్ వీల్ డ్రైవ్) వేరియంట్ ఏకంగా 778 bhp పవర్ ను, 802 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంటే కేవలం రెప్పపాటు కాలంలోనే ఇది అత్యధిక వేగాన్ని అందుకుంటుంది. లగ్జరీ, వేగం కోరుకునే వారికి ఇది ఒక డ్రీమ్ కార్ అని చెప్పవచ్చు.

మొత్తానికి ఎంజీ మోటార్ ఇండియా ఈ 4 కొత్త మోడళ్లతో భారత ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ ని ఏలడానికి సర్వం సిద్ధం చేసుకుంది. త్వరలోనే వీటి ధర, అధికారిక లాంచ్ తేదీలు వెల్లడి కానున్నాయి.

Tags:    

Similar News