MG Windsor EV: విండ్సర్ ఈవీ కొనేవారికి బ్యాడ్ న్యూస్.. ఒక్కసారిగా ధరలు పెంచేసిన ఎంజీ మోటార్స్
ధరలు పెంచేసిన ఎంజీ మోటార్స్
MG Windsor EV: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా పోర్ట్‌ఫోలియోలో అత్యంత ప్రజాదరణ పొందిన విండ్సర్ ఈవీ ధరలకు రెక్కలొచ్చాయి. వినూత్న డిజైన్, విశాలమైన ఇంటీరియర్ స్పేస్, 449 కిమీ మైలేజ్ రేంజ్‌తో కస్టమర్ల మనసు దోచుకుంటున్న ఈ ఎలక్ట్రిక్ కారును సొంతం చేసుకోవడం ఇప్పుడు కాస్త భారంగా మారింది. కంపెనీ ఈ మోడల్ వేరియంట్లపై ఒకేసారి రూ.15,000 వరకు ధరలను పెంచేసింది. పెరిగిన కొత్త ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. సవరించిన ధరల ప్రకారం విండ్సర్ ఈవీ కొత్త ఎక్స్-షోరూమ్ ధర రూ.14.85 లక్షల నుంచి ప్రారంభమై రూ.19.15 లక్షల వరకు చేరింది.
ఎంజీ విండ్సర్ ఈవీ ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎస్సెన్స్ అనే మూడు ప్రధాన వేరియంట్లలో లభిస్తోంది. వీటిలో ఎక్స్‌క్లూజివ్, ఎస్సెన్స్ వేరియంట్లు ప్రో వెర్షన్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రో వేరియంట్లలో 52.9kWh పెద్ద బ్యాటరీ ప్యాక్, వినూత్నమైన ఇంటీరియర్ థీమ్స్, లెవెల్-2 ఏడాస్ ఫీచర్లను అందించారు. అయితే ఇటీవల మార్కెట్లోకి పరిచయం చేసిన పరిమిత ఎడిషన్ ఇండల్జ్ మోడల్‌పై ఈ ధరల పెంపు వర్తించదు. కేవలం 300 యూనిట్లకు మాత్రమే పరిమితమైన ఈ స్పెషల్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.18 లక్షల వద్దే కొనసాగుతోంది.
బ్యాటరీ సామర్థ్యం.. అద్భుతమైన రేంజ్
ఈ మోడల్‌లో రెండు బ్యాటరీ ఆప్షన్లను అందుబాటులో ఉంచారు. అందులో 38 kWh కెపాసిటీ ఉన్న బ్యాటరీ ప్యాక్ ఒకే ఛార్జ్‌పై 332 కిలోమీటర్ల MIDC సర్టిఫైడ్ రేంజ్ అందిస్తుంది. అలాగే 52.9 kWh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీ ఏకంగా 449 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 134 నుంచి 136 PS పవర్‌ను విడుదల చేస్తూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వేగంగా ఛార్జ్ అవుతుంది.
అట్రాక్టివ్ ఇంటీరియర్ ఫీచర్లు
విండ్సర్ ఈవీ లోపలి భాగంలో ప్రయాణికులకు బిజినెస్ క్లాస్ అనుభూతిని ఇచ్చేలా 135 డిగ్రీల వరకు వెనక్కి వాలే ఎయిరో-లాంజ్ సీట్లను అందించారు. కేబిన్ అందాన్ని పెంచేందుకు ఇన్ఫినిటీ గ్లాస్ రూఫ్, 579 లీటర్ల నుంచి 604 లీటర్ల భారీ బూట్ స్పేస్ ఉన్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సబ్‌వూఫర్‌తో కూడిన 9-స్పీకర్ ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్, 15.6 అంగుళాల గ్రాండ్‌వ్యూ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి హైటెక్ ఫీచర్లు పొందుపరిచారు.
సేఫ్టీలో రాజీ లేదు
ప్రయాణికుల భద్రతకు ఈ కార్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. డ్యూయల్ ఫ్రంట్, సైడ్, కర్టెన్ సహా 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. వీటితో పాటు 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ కంట్రోల్, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటి భద్రతా సదుపాయాలు ఉన్నాయి. టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా XUV400 వంటి ప్రముఖ కార్లకు ఇది గట్టి పోటీ ఇస్తోంది.