MG Motor : మార్కెట్లో బాగా అమ్ముడుపోయే మోడల్ ధర రూ.21వేలు పెంచిన ఎంజీ
మోడల్ ధర రూ.21వేలు పెంచిన ఎంజీ;
MG Motor : ఎంజీ మోటార్ నుంచి బాగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు ఎంజీ విండ్సర్ ఈవీ ధర పెరిగింది. ఇప్పుడు ఈ కారు కొనాలంటే మీరు గతంలో కన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ కారులోని అన్ని వేరియంట్ల ధరలు పెరగలేదు. కేవలం ఎసెన్స్ ప్రో మోడల్ ధర మాత్రమే రూ. 21,000 పెరిగింది. ఎంజీ విండ్సర్ ఈవీ ఎసెన్స్ ప్రో వేరియంట్‌ను మే నెలలో లాంచ్ చేసినప్పుడు, దీని ప్రారంభ ధర రూ. 17.49లక్షలుగా ఉండేది. ఈ ధర మొదటి 8000 బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తుందని అప్పట్లో కంపెనీ ప్రకటించింది. ఈ 8000 బుకింగ్స్ కంపెనీకి కేవలం 24 గంటల్లోనే వచ్చేశాయి.
ఇప్పుడు కంపెనీ ఈ కారు ధరను రూ. 21,000 (ఎక్స్-షోరూం) పెంచింది. ఈ ధర పెంపునకు కారణం ఉత్పత్తి ఖర్చులు పెరగడం అయి ఉండవచ్చు, కానీ దీనిపై కంపెనీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ధర పెరిగిన తర్వాత, ఇప్పుడు ఈ వేరియంట్ రూ. 18.31లక్షలకు అందుబాటులో ఉంటుంది.
అయితే, MG BaaS ఆప్షన్‌ను ఎంచుకునే కస్టమర్‌లకు విండ్సర్ ఎసెన్స్ ప్రో తక్కువ ధరకే లభిస్తుంది. ఈ ఆప్షన్‌తో ఈ కారు మీకు రూ. 13.31లక్షలకే వస్తుంది. అంటే దాదాపు రూ. 5 లక్షల వరకు ఆదా అవుతుందన్నమాట. కానీ, ఈ ఆప్షన్ ఎంచుకున్న కస్టమర్‌లు ప్రతి కిలోమీటరుకు రూ. 4.50 చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ BaaS ఆప్షన్ కారు కొనేటప్పుడు బ్యాటరీ ఖర్చును వేరు చేసి, కారు ధరను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే బ్యాటరీ వాడకానికి కిలోమీటర్ల లెక్కన చార్జ్ చేస్తారు.
ఎంజీ విండ్సర్ ఎసెన్స్ ప్రో వేరియంట్‌లో లెవల్ 2 ఏడీఏఎస్, వెహికల్ టు లోడ్, వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్ టెక్నాలజీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, స్టైలిష్ అల్లాయ్ వీల్స్ వంటి ప్రత్యేక ఫీచర్లున్నాయి. ఇక మైలేజ్ విషయానికి వస్తే, ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ కారు 449 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది.