MG Windsor EV : టాటా నెక్సాన్ ను వెనక్కి నెట్టి చరిత్ర సృష్టించిన ఎంజీ విండ్సర్
చరిత్ర సృష్టించిన ఎంజీ విండ్సర్;
MG Windsor EV : టాటా నెక్సాన్ ఈవీ మార్కెట్‌లో గట్టి పోటీ ఉన్నప్పటికీ, జేఎస్‌డబ్ల్యూకు చెందిన ఎంజి మోటార్ ఇండియా ఎలక్ట్రిక్ కారు విండ్‌సర్ ఈవీ అత్యధిక అమ్మకాలను సాధించింది. జులై 2025లో 4,308 యూనిట్ల రిటైల్ అమ్మకాలతో, ఈ కారు ఇప్పటివరకు అత్యుత్తమ నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. ఈ కారు మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 36,000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటింది. దీంతో ఈ విభాగంలో కంపెనీ స్థానం మరింత పటిష్టం అయింది. ఈ అద్భుతమైన అమ్మకాలతో ఎంజి ఈవీ మార్కెట్ వాటా 2025 రెండవ త్రైమాసికంలో 32 శాతానికి పెరిగింది. ఇది గత త్రైమాసికం కంటే 4 శాతం ఎక్కువ. ఇదే సమయంలో విండ్‌సర్ సగటు అమ్మకాలు 17 శాతం పెరిగాయి. కంపెనీ మొత్తం ఈవీ అమ్మకాలు 28 శాతం పెరిగాయి. టాటా నెక్సాన్ ఈవీతో పోలిస్తే ఇది నిజంగా ఒక బంపర్ హిట్ అని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం ఈ కారు ధర, ఫీచర్లు, డిజైన్ అని నిపుణులు చెబుతున్నారు.
ఎంజి విండ్‌సర్ ఈవీ డిజైన్ ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఏ ఇతర క్రాసోవర్‌ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో హ్యాచ్‌బ్యాక్, ఎంపీవీ, కాంపాక్ట్ ఎస్‌యూవీల స్టైల్స్ అన్నీ కలిపి ఉంటాయి. ముందు భాగంలో, ఎల్‌ఈడీ డే-టైమ్ రన్నింగ్ లైట్లు, ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లతో కూడిన స్ప్లిట్ లైటింగ్ డిజైన్ ఉంది. మధ్యలో వెలిగే ఎంజి లోగో దీని లుక్‌ను మరింత పెంచుతుంది. కారు సైడ్ ప్రొఫైల్‌లో స్మూత్‌గా ఉండే లైన్లు, పెద్ద కిటికీలు, అల్లాయ్ వీల్స్, కొన్ని మోడళ్లలో బ్లాక్-అవుట్ పిల్లర్స్ ఉన్నాయి. ఇవి కారుకు తేలియాడే రూఫ్ లాంటి లుక్‌ను ఇస్తాయి. కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, రూఫ్ స్పాయిలర్, వెనుకవైపు వాలుగా ఉండే విండోలు దీని వెనుక భాగాన్ని మరింత స్టైలిష్‌గా మారుస్తాయి.
కారు లోపల డార్క్ కలర్ థీమ్‌తో కూడిన క్యాబిన్ చాలా ప్రీమియంగా ఉంటుంది. పనోరమిక్ గ్లాస్ రూఫ్ క్యాబిన్‌కు మరింత లగ్జరీ లుక్ ఇస్తుంది. సెంటర్ కన్సోల్‌లో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది నావిగేషన్, ఇతర ఎంటర్టైన్మెంట్ ఫీచర్లను కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా, ఈ కారు క్యాబిన్ అనేక పవర్ఫుల్ ఫీచర్లతో నిండి ఉంది. విండ్‌సర్‌లో 135 డిగ్రీల వరకు వంగే ఏరో లాంజ్ సీట్లు ఉన్నాయి. ఇది ప్రయాణికులకు అదనపు సౌకర్యాన్ని అందిస్తుంది. తక్కువ ప్రారంభ ధరతో ఈవీని కొనుగోలు చేయడానికి ఎంజి బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ ఆప్షన్‌ను కూడా అందిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.9.99 లక్షలు.
ఎంజి విండ్‌సర్ ఈవీ అన్ని వేరియంట్‌లలో 38 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ 134 బీహెచ్‌పీ పవర్, 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఈవీ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 331 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. ప్రో వేరియంట్‌లో అయితే ఇంకా పెద్ద 52.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. ఇది ఒక్క ఛార్జ్‌తో 449 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. అయితే, ప్రో వేరియంట్ పవర్ అవుట్‌పుట్ మాత్రం 38 కేడబ్ల్యూహెచ్ వేరియంట్‌తో సమానంగా ఉంటుంది. ఈ కారు టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ400, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ వంటి కార్లకు గట్టి పోటీనిస్తుంది.