Mini Cooper : ఇండియాలో మిని కూపర్ సునామీ..24 గంటల్లోనే స్టాక్ ఖాళీ..క్యూ కడుతున్న కోటీశ్వరులు
24 గంటల్లోనే స్టాక్ ఖాళీ..క్యూ కడుతున్న కోటీశ్వరులు
Mini Cooper : లగ్జరీ కార్ల మార్కెట్‌లో బ్రిటిష్ బ్రాండ్ మిని సరికొత్త చరిత్ర సృష్టించింది. బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్‌కు చెందిన ఈ సంస్థ, భారతదేశంలో తన సరికొత్త మిని కూపర్ కన్వర్టబుల్ మోడల్‌ను లాంచ్ చేసిన కేవలం 24 గంటల్లోనే మొదటి లాట్ మొత్తం అమ్ముడైపోయింది. డిసెంబర్ 12న మార్కెట్లోకి వచ్చిన ఈ కారుకు భారతీయ ధనవంతుల నుండి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. రూ.58.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో వచ్చిన ఈ కారు, ప్రస్తుతం దేశంలోనే అత్యంత చవకైన ఓపెన్-టాప్(కన్వర్టబుల్) లగ్జరీ కారుగా గుర్తింపు పొందింది. మొదటి విడత కార్లు హాట్ కేకుల్లా అమ్ముడవ్వడంతో, కంపెనీ ఇప్పుడు రెండో విడత కోసం బుకింగ్స్‌ను ప్రారంభించింది. వీటి డెలివరీ వచ్చే ఏడాది ఆరంభంలో ఉండనుంది.
ఈ కారుకు ఇంతటి క్రేజ్ రావడానికి ప్రధాన కారణం దీని పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్. ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 201 bhp శక్తిని, 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి తోడు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉండటంతో డ్రైవింగ్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఈ కారు కేవలం 6.9 సెకన్లలోనే సున్నా నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇక దీని గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్లు. విదేశాల నుండి నేరుగా దిగుమతి చేసుకున్న మోడల్ కావడంతో, దీని నాణ్యత అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది.
డిజైన్ విషయానికి వస్తే, మిని కూపర్ తన క్లాసిక్ లుక్‌ను కొనసాగిస్తూనే ఆధునిక మార్పులు చేసుకుంది. ముందు భాగంలో కొత్త రకమైన రౌండ్ ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్, స్టైలిష్ రేడియేటర్ గ్రిల్ ఉన్నాయి. 18 అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ కారుకు ఒక ప్రీమియం అప్పీల్‌ను ఇస్తాయి. కన్వర్టబుల్ ఫీచర్ కావడంతో, కేవలం ఒక బటన్ నొక్కగానే కారు పైకప్పు తెరుచుకుని మీకు ఆకాశం కనిపించేలా చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో దీనికి పోటీగా ఉన్న ఎంజీ సైబర్‌స్టర్ ధర రూ. 75 లక్షల పైనే ఉండటంతో, తక్కువ ధరలో లగ్జరీ కోరుకునే వారికి మిని కూపర్ బెస్ట్ ఆప్షన్‌గా మారింది.
కస్టమర్ల నమ్మకాన్ని పెంచేలా కంపెనీ ఈ కారుపై 2 ఏళ్ల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీని, 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ను అందిస్తోంది. కేవలం స్టైల్ మాత్రమే కాకుండా భద్రత, పెర్ఫార్మెన్స్‌లో కూడా ఈ కారు ఎక్కడా తగ్గదు. ఐకానిక్ బ్రిటిష్ డిజైన్, జర్మన్ ఇంజనీరింగ్ కలయికతో వచ్చిన ఈ 'మిని' మాయాజాలం ఇప్పుడు ఇండియాలో గట్టిగా పనిచేస్తోంది. లగ్జరీ కార్ల విభాగంలో ఇదొక సంచలనంగా నిలిచిందనడంలో సందేహం లేదు.