New Car Launches: కొత్త కారు కొంటున్నారా? ఒక్క 2 వారాలు ఆగండి.. మార్కెట్లోకి వస్తున్న 3 సూపర్ హిట్ కార్లు
మార్కెట్లోకి వస్తున్న 3 సూపర్ హిట్ కార్లు
New Car Launches: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ జులై 2026 నెలలో సరికొత్త లాంచ్‌లతో ఎంతో సందడిగా మారింది. ఈ నెల ప్రారంభంలోనే ఇప్పటికే పలు సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు, ఎస్‌యూవీ మోడళ్లు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి కస్టమర్లను ఆకట్టుకున్నాయి. అయితే హడావుడి ఇక్కడితో ముగిసిపోలేదు. ఈ జులై నెల చివరి రెండు వారాల్లో భారత రోడ్లపైకి మరో మూడు సరికొత్త పవర్‌ఫుల్ కార్లు దూసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ జాబితాలో మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్, టయోటా హిలక్స్, హోండా జెడ్ఆర్-వి హైబ్రిడ్ వంటి మోస్ట్ అవేటెడ్ మోడళ్లు ఉన్నాయి. మీరు కూడా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ కార్ల లాంచ్ వివరాలు, ఫీచర్లు తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోండి.
మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడంటే?
భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ మారుతి సుజుకి బ్రెజ్జా సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లో జులై 23న లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, కియా సోనెట్ వంటి బలమైన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేలా మారుతి ఈ కారును ముస్తాబు చేసింది. ఈ కొత్త బ్రెజ్జా డిజైన్‌లో మేజర్ అప్‌డేట్స్ కనిపించనున్నాయి. ఇందులో రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త బంపర్లు, సిల్వర్ స్కిడ్ ప్లేట్లు, సరికొత్త స్టైలిష్ అల్లాయ్ వీల్స్ ఉండబోతున్నాయి. కారు వెనుక భాగంలో కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్,అప్‌డేటెడ్ బంపర్ కారుకు మరింత స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి.
బూస్టర్‌జెట్ టర్బో ఇంజిన్‌తో వస్తున్న నయా బ్రెజ్జా
బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ విషయానికి వస్తే.. కేబిన్‌ను మరింత మోడ్రన్‌గా మార్చారు. ఇందులో 10.1 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ వేరియంట్ల కోసం పెడల్ షిఫ్టర్లు వంటి లగ్జరీ ఫీచర్లు జోడించనున్నారు. అయితే అన్నింటికంటే పెద్ద మార్పు దీని ఇంజిన్ లో ఉండబోతోంది. ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్లతో పాటు, మారుతి ఫ్రాంక్స్ కారు నుంచి సేకరించిన 1.0 లీటర్ బూస్టర్‌జెట్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కూడా ఈ కొత్త బ్రెజ్జాలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ కారు ప్రారంభ ధర మార్కెట్లో సుమారు రూ.8.8 లక్షలుగా ఉండే అవకాశం ఉంది.
కొత్త అవతారంలో టయోటా హిలక్స్ పిక్కప్ ట్రక్
ప్రముఖ జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా తన సరికొత్త జనరేషన్ హిలక్స్ పిక్కప్ ట్రక్కును జులై 28న భారత మార్కెట్లో ప్రదర్శించడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త మోడల్ ప్రస్తుత ఐఎమ్‌వీ ప్లాట్‌ఫారమ్‌పైనే ఆధారపడి నిర్మించినప్పటికీ, దీని రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. నయా టయోటా హిలక్స్ లో స్లిమ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, పెద్ద హనీకోంబ్ గ్రిల్, సరికొత్త అల్లాయ్ వీల్స్‌తో అగ్రెసివ్ లుక్ ఇచ్చారు. కారు లోపల డ్యూయల్ 12.3 ఇంచుల భారీ స్క్రీన్ సెటప్, వైర్‌లెస్ కనెక్టివిటీ, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండనున్నాయి. కఠినమైన రోడ్లపై సైతం సులభంగా ప్రయాణించేలా పటిష్టమైన ఆఫ్-రోడ్ సామర్థ్యాలు ఇందులో జోడించారు.
హోండా జెడ్ఆర్-వి హైబ్రిడ్ ఎస్‌యూవీ
ఈ జులై మూడో వారంలో హోండా సంస్థ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ జెడ్ఆర్-వి హైబ్రిడ్‌ను భారతదేశంలో లాంచ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ కారును విదేశాల నుండి నేరుగా సీబీయూ (CBU) రూట్ ద్వారా పరిమిత సంఖ్యలో భారత్‌కు దిగుమతి చేయనున్నారు. ఈ లగ్జరీ కారులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. ఇది 184 bhp గరిష్ట పవర్‌ను, 315 Nm టాప్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హోండా కంపెనీ సమాచారం ప్రకారం.. ఈ హైబ్రిడ్ ఎస్‌యూవీ లీటరు పెట్రోలుకు ఏకంగా 22.8 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇందులో 9 ఇంచుల టచ్‌స్క్రీన్, 10.25 ఇంచుల డిజిటల్ డిస్‌ప్లే, బోస్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి గ్లోబల్ స్టాండర్డ్ ఫీచర్లు కస్టమర్లకు లభించనున్నాయి.