Road Safety: రాత్రి వేళల్లో ఎదురుగా వచ్చే వాహనాల తీవ్రమైన హెడ్‌లైట్ వెలుతురు కారణంగా జరుగుతున్న రహదారి ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నగరాల్లోనూ, రహదారులపై సాధార‌ణ ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్న హై-బీమ్ వెలుతురు సమస్యను తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర మోటారు వాహనాల నిబంధనల్లో మార్పులు తేనుంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ రూపొందిస్తున్న ఈ కొత్త భద్రతా ప్రమాణాలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయి.

కొత్త బైకుల్లో ఆటోమేటిక్ లో-బీమ్ సిస్టమ్

నూతన నిబంధనల ప్రకారం ఇకపై ఉత్పత్తి అయ్యే కొత్త ద్విచక్ర వాహనాల్లో ఆటోమేటిక్ హెడ్‌లైట్ ఆన్ (AHO) సిస్టమ్ కేవలం లో-బీమ్ (పాసింగ్ బీమ్) వద్ద మాత్రమే పనిచేసేలా రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం వాహనం ఆన్ చేయగానే మునుపటి సెట్టింగ్స్ బట్టి హై-బీమ్ లేదా లో-బీమ్ వెలుగుతోంది. కొత్త నిబంధన అమల్లోకి వచ్చాక వాహనం స్టార్ట్ కాగానే కేవలం లో-బీమ్ మాత్రమే వెలుగుతుంది. ఈ మార్పు కేవలం కొత్తగా తయారయ్యే బైకులు, స్కూటర్లకు మాత్రమే వర్తిస్తుంది. రోడ్లపై ఇప్పటికే ప్రయాణిస్తున్న పాత వాహనాలకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది.

హెడ్‌లైట్ల తీవ్రత, రంగుపై కొత్త పరిమితులు

వాహనాల హై-బీమ్ లైట్ల గరిష్ట వెలుతురు సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ద్విచక్ర వాహనాల్లో ఈ పరిమితిని 1.5 లక్షల క్యాండెలా నుంచి 1 లక్ష క్యాండెలాకు తగ్గించనున్నారు. కార్లలో 2.25 లక్షల క్యాండెలా నుంచి 1.5 లక్షల క్యాండెలాకు పరిమితం చేయనున్నారు. వీటితో పాటు హెడ్‌లైట్లు, ఫ్రంట్ ఫాగ్ లాంప్‌ల కలర్ టెంపరేచర్ పరిమితిని గరిష్టంగా 6,500 కెల్విన్‌గా నిర్ణయించనున్నారు. దీనివల్ల కళ్లను పొడిచే అతి తెల్లటి వెలుతురు తగ్గి ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుంది.

నగరాల్లో హై-బీమ్ వేస్తే ఆడియో అలర్ట్

నగర పరిధిలో కారు లేదా బైక్ నడుపుతున్నప్పుడు డ్రైవర్లు అనవసరంగా హై-బీమ్ ఆన్ చేస్తే హెచ్చరించేలా వాహనాల్లో ప్రత్యేక ఆడియో అలర్ట్ సిస్టమ్‌ను అమర్చనున్నారు. ఈ సిస్టమ్ లో-బీమ్ ఉపయోగించాల్సిందిగా డ్రైవర్‌ను అలర్ట్ చేస్తుంది. ఈ హెచ్చరిక కేవలం తక్కువ వేగంతో వెళ్లేటప్పుడు మాత్రమే పనిచేస్తుంది. గంటకు 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో హైవేలపై ప్రయాణించేటప్పుడు ఈ అలర్ట్ రాదు. చీకటిగా ఉండే హైవేలపై వెలుతురు అవసరం కాబట్టి అక్కడ మినహాయింపునిచ్చారు.

భారీ వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులు

రాత్రి వేళల్లో రోడ్లపై నిలిపి ఉంచే బస్సులు, ఇతర భారీ రవాణా వాహనాలు సులభంగా కనిపించేలా కచ్చితమైన రేడియం రిఫ్లెక్టివ్ టేపులు వేయడం తప్పనిసరి చేయనున్నారు. చీకటిలో లేదా వర్షం, పొగమంచు సమయంలో వెనుక నుంచి వచ్చే వాహనదారులకు ఈ టేపుల వల్ల ముందస్తు సమాచారం అందుతుంది. రాత్రి వేళ డ్రైవర్ల కళ్లు బైర్లు కమ్మకుండా చేసి ప్రమాదాల నివారణకు ఈ నిబంధనలు దోహదపడనున్నాయి. తీవ్రమైన హెడ్‌లైట్ల వెలుతురు వల్ల ఎదురయ్యే తాత్కాలిక అంధత్వాన్ని నివారించి రోడ్డు భద్రతను పెంచేందుకు ఈ నూతన నిబంధనలు ఎంతగానో తోడ్పడతాయి.

Tags: