Maruti Baleno : మారుతి నుంచి అదిరిపోయే న్యూస్.. కొత్త లుక్, హైబ్రిడ్ ఇంజిన్‌తో వస్తున్న బాలెనో ఫేస్‌లిఫ్ట్

కొత్త లుక్, హైబ్రిడ్ ఇంజిన్‌తో వస్తున్న బాలెనో ఫేస్‌లిఫ్ట్

Update: 2026-08-04 11:31 GMT

 Maruti Baleno : భారత ఆటోమొబైల్ రారాజు మారుతి సుజుకి తన అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనోలో సరికొత్త వర్షన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ ప్రోటోటైప్ మొదటిసారిగా భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కెమెరాలకు చిక్కింది. ఈ స్పై షాట్ల ఆధారంగా కారు డిజైన్, సరికొత్త ఫీచర్లు, ఇంజిన్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఈ సరికొత్త మోడల్‌ను 2026 ద్వితీయార్థంలో అధికారికంగా మార్కెట్లోకి తెచ్చేందుకు కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది.

డిజైన్‌లో ప్రధాన మార్పులు.. మరింత స్పోర్టీ లుక్

ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న కొత్త బాలెనో సైజ్ పరంగా పాత మోడల్ లాగే ఉన్నప్పటికీ, డిజైన్ పరంగా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. కారు ముందు భాగంలో మరింత వెడల్పాటి గ్రిల్, కొత్త డిజైన్ హెడ్‌లైట్లు, సరికొత్త బంపర్ ఇచ్చారు. సైడ్ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా, సరికొత్త డిజైన్‌తో కూడిన అలాయ్ వీల్స్‌ను అందించనున్నారు. టెస్టింగ్ సమయంలో కార్ పూర్తిగా కవర్ చేయబడి ఉండటంతో కొన్ని డిజైన్ వివరాలు రహస్యంగానే ఉన్నాయి.

హైటెక్ ఇంటీరియర్స్.. లెవెల్-2 ADAS సేఫ్టీ

కొత్త బాలెనో ఇంటీరియర్‌లో కూడా భారీ అప్‌డేట్లు రాబోతున్నాయి. కేబిన్ లోపల కొత్త కలర్ థీమ్, రిఫ్రెషింగ్ అప్‌హోల్‌స్టరీని ఉపయోగించనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం పెద్ద సైజ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లను కూడా చేర్చనున్నట్లు సమాచారం. వీటిన్నింటికంటే ముఖ్యంగా, ఇటీవలే ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్‌లో టెస్ట్ చేసినట్లే, ఈ కొత్త బాలెనోలో కూడా భద్రత కోసం లెవెల్-2 ADAS సేఫ్టీ ఫీచర్లను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.

మైలేజ్ పెంచేలా పవర్‌ఫుల్ హ్యాబ్రిడ్ ఇంజిన్

మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్ పరంగా పెద్ద విప్లవాన్నే తీసుకురానుంది. ఇందులో ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ మోటార్‌ను జత చేసి హైబ్రిడ్ సిస్టమ్ ను అందించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనివల్ల కారు పెర్ఫార్మెన్స్ పెరగడమే కాకుండా, ఇంధన పొదుపు, మైలేజ్ ఊహించని స్థాయిలో పెరగనున్నాయి. లాంచ్ తేదీ, ధరలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని మారుతి సుజుకి త్వరలోనే వెల్లడించనుంది.

Tags:    

Similar News