Road Safety: డ్రైవింగ్ చేస్తూ మ్యూజిక్ మార్చుతున్నారా? రోడ్డు ప్రమాదాలకు అసలు కారణం ఇదే
రోడ్డు ప్రమాదాలకు అసలు కారణం ఇదే
Road Safety: డ్రైవింగ్ చేస్తూ కొత్త పాటలు వెతకడం, ఫోన్ స్క్రీన్ చూడడం ఎంతటి ప్రమాదకరమో హార్వర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధనలో వెల్లడైంది. పెద్ద ఆల్బమ్‌లు విడుదలైన రోజుల్లో ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు ఏకంగా 15.1 శాతం పెరిగాయనే షాకింగ్ నిజం కంగారు పెడుతోంది. వాహనం నడుపుతున్నప్పుడు ఫోన్ మాట్లాడడం, సందేశాలు పంపడం ప్రమాదకరమని అందరికీ తెలిసిందే. ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌లలో కొత్త పాటలు వెతకడం కూడా అంతే ముప్పు తెచ్చిపెడుతోంది. అమెరికాలో జరిగిన ఈ తాజా అధ్యయనం జామా నెట్‌వర్క్ ఓపెన్ పత్రికలో ప్రచురితమైంది. హార్వర్డ్ పరిశోధకులు 2017 నుంచి 2022 వరకు ఆరేళ్ల పాటు జరిగిన ప్రమాదాల గణాంకాలను పరిశీలించారు. ఫాటాలిటీ అనాలసిస్ రిపోర్టింగ్ సిస్టమ్ డేటాను స్పాటిఫై చార్ట్‌లతో పోల్చి చూసినప్పుడు బిగ్ ఆల్బమ్ రిలీజ్ రోజుల్లో మరణాల సంఖ్య విపరీతంగా పెరిగినట్లు తేలింది.
పాటల వల్ల కాదా? దృష్టి మళ్లడమే అసలు సమస్య
సంగీతం వినడం మాత్రమే ఇక్కడ ప్రమాదకారి కాదు. వాహనం నడుపుతున్న వ్యక్తి క్రొత్త పాటను వెతకడానికి లేదా ఆల్బమ్ ఎంచుకోవడానికి ఫోన్ తీయడం, స్మార్ట్ స్క్రీన్ పదే పదే చూడడం అసలు సమస్యగా మారుతోంది. రహదారిపై డ్రైవర్ తన దృష్టిని కొన్ని సెకన్ల పాటు పక్కకు మళ్లిస్తే వాహనం మీదున్న నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రమాదం జరిగిన సమయం, వారంలో రోజులు, వాహనంలో ఉన్న ప్రయాణికుల సంఖ్య వంటి అనేక విషయాలను విశ్లేషించినా, కొత్త ఆల్బమ్‌లు వచ్చిన రోజుల్లో ప్రమాదాల శాతం పెరగడం గమనార్హం.
ఫాస్ట్ మ్యూజిక్ ఎఫెక్ట్ ఎంతవరకు నిజం?
కొన్ని ఇతర అధ్యయనాల ప్రకారం.. ఫాస్ట్ బీట్ ఉన్న పాటలు విన్నప్పుడు డ్రైవర్లు కాస్త ఆవేశంగా లేదా వేగంగా వాహనాలు నడిపే అవకాశం ఉంది. ప్రతీ ఒక్కరిపై ఈ ప్రభావం ఒకేలా ఉండకపోయినా, ఫాస్ట్ బీట్ సాంగ్ మ్యూజిక్ గుండె కొట్టుకునే వేగాన్ని పెంచి అజాగ్రత్తకు దారితీసే వీలుంది. అసలు ముప్పు పాట కానే కాదు, వాహనం నడుపుతున్నప్పుడు శ్రద్ధ తగ్గిపోవడమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
సురక్షిత డ్రైవింగ్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సుదూర ప్రయాణాలకు లేదా ప్రతీరోజు ప్రయాణానికి ముందే మీకు నచ్చిన ప్లేలిస్ట్‌ను సిద్ధం చేసుకోవడం సురక్షితమైన మార్గం. డ్రైవింగ్ ప్రారంభించిన తర్వాత ప్రయాణ మధ్యలో పాటలు మార్చడానికి ఫోన్ ఉపయోగించకూడదు. కారులోని వాయిస్ కమాండ్, హ్యాండ్స్ ఫ్రీ ఫీచర్లను ఉపయోగించడం వల్ల స్క్రీన్ వైపు చూడకుండానే సురక్షితంగా డ్రైవ్ చేయవచ్చు. రహదారిపై ప్రయాణించేటప్పుడు మీ పూర్తి దృష్టి రహదారిపైనే ఉండడం అత్యంత ఆవశ్యకం.