Renault Duster : బోల్డ్ డిజైన్, అడ్వాన్సుడ్ ఫీచర్లు.. త్వరలో మార్కెట్లోకి డస్టర్ రీఎంట్రీ
త్వరలో మార్కెట్లోకి డస్టర్ రీఎంట్రీ
Renault Duster : రెనాల్ట్ కంపెనీ భారతదేశంలో తన న్యూ జనరేషన్ డస్టర్ ఎస్‌యూవీని తీసుకురాబోతోంది. ఈ కారును వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేస్తారు. రెనాల్ట్ ఈ కొత్త డస్టర్ ప్రస్తుతానికి కేవలం పెట్రోల్ ఇంజిన్ తో నడిచే మోడల్‌లో మాత్రమే వస్తుంది. ఆ తర్వాత, వెనుక మూడు వరుసల సీట్లు (7 సీటర్) ఉన్న మోడల్‌ను కూడా మార్కెట్‌లోకి తీసుకువస్తారు. కొత్త డస్టర్ ఎస్‌యూవీ డిజైన్ చాలా పవర్ఫుల్ గా కనిపిస్తుంది. కారులో వై-ఆకారపు ప్రత్యేక డిజైన్ ఉపయోగించారు. అంతేకాకుండా బయటి భాగంలో (బాడీ) కూడా అనేక మార్పులు చేశారు. వీటిలో కొత్త ముందు గ్రిల్, హెడ్‌లైట్ డిజైన్, వీల్ ఆర్చ్‌లు, పెరిగిన గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి.
కొత్త డస్టర్‌ను ప్రస్తుతానికి కేవలం పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే విడుదల చేస్తారు. ఇందులో 1.3 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందిస్తారని భావిస్తున్నారు. ఇది స్ట్రాంగ్ పర్ఫామెన్స్, మెరుగైన మైలేజీని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది. ఈ ఇంజిన్‌తో పాటు కంపెనీ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను అందిస్తుంది. అయితే, పాత మోడల్‌లో ఉన్న ఆల్-వీల్ డ్రైవ్ సౌకర్యం ఈసారి ఉండకపోవచ్చు. ఎందుకంటే రెనాల్ట్ ఇప్పుడు సిటీలో వాడకానికి అనువైన, తక్కువ ధరలో లభించే మోడల్‌లపై దృష్టి సారిస్తోంది.
భారత్‌లో విడుదల కానున్న డస్టర్‌ను మరింత ప్రీమియంగా, మెరుగైన సౌకర్యాలతో తీసుకువస్తారు. ఈ కొత్త డస్టర్‌లో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ మీటర్ల క్లస్టర్, 360 డిగ్రీల కెమెరా, ఏడీఏఎస్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి సౌకర్యాలు లభించే అవకాశం ఉంది. రెనాల్ట్ భారతీయ కొనుగోలుదారుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని భారతీయ మార్కెట్‌కు అనుగుణంగా తయారు చేస్తోంది. తద్వారా ఈ కారు పోటీలో ముందుండగలదు. ఈ విభాగంలో ఇప్పటికే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ వంటి ప్రముఖ వాహనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త డస్టర్ గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది.