Nissan Kait : క్రెటా, సఫారీలకు షాక్.. కొత్త నిస్సాన్ కైట్ SUV ఫస్ట్ లుక్ రివీల్

కొత్త నిస్సాన్ కైట్ SUV ఫస్ట్ లుక్ రివీల్

Update: 2025-12-06 09:28 GMT

Nissan Kait : ప్రపంచవ్యాప్తంగా కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీని పెంచేందుకు నిస్సాన్ సంస్థ తన సరికొత్త మోడల్ అయిన నిస్సాన్ కైట్ ఎస్‌యూవీని బ్రెజిల్‌లోని సావో పాలోలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మొదటిసారి ఆవిష్కరించింది. బ్రెజిల్‌లోని నిస్సాన్ ప్లాంట్‌లో ఈ ఎస్‌యూవీ ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది. కంపెనీ 2026 సంవత్సరం నుంచి ఈ మోడల్‌ను 20కి పైగా దేశాలకు ఎగుమతి చేయాలని యోచిస్తోంది. ముఖ్యంగా ఇది లాటిన్ అమెరికాతో పాటు ఇతర దేశాలలో హ్యుందాయ్ క్రెటా, వోక్స్‌వ్యాగన్ టెర్రా వంటి కార్లకు గట్టి పోటీని ఇవ్వనుంది. అయితే ఈ కారు భారత్‌లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే దానిపై నిస్సాన్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

భారతీయ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని నిస్సాన్ కొత్త వ్యూహాన్ని రచిస్తోంది. ముఖ్యంగా రెనాల్ట్ డస్టర్ మూడవ జనరేషన్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి ఒక సరికొత్త C-సెగ్మెంట్ ఎస్‌యూవీని తయారు చేస్తోంది. ఈ కారు 2026 ప్రారంభంలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త ఎస్‌యూవీలో రెనాల్ట్ డస్టర్ ఫీచర్లు, ఇంజిన్‌ను పంచుకున్నప్పటికీ డిజైన్‌లో మాత్రం కొత్త స్టైల్‌ను కలిగి ఉంటుంది. ఇందులో నిస్సాన్ మాగ్నైట్, కైట్ ఎస్‌యూవీల లుక్‌ను కూడా చూడవచ్చు. కొలతల విషయానికి వస్తే.. నిస్సాన్ కైట్ ఎస్‌యూవీ పొడవు 4.30 మీటర్లు, వెడల్పు 1.76 మీటర్లు, వీల్‌బేస్ 2.62 మీటర్లు ఉంది. ఇది 432 లీటర్ల పెద్ద బూట్ స్పేస్‌ను కలిగి ఉండటం వలన, క్యాబిన్ లోపల చాలా విశాలంగా, సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

నిస్సాన్ కైట్ ఎస్‌యూవీ నాలుగు గ్లోబల్ ట్రిమ్స్‌లో (Active, Sense Plus, Advance Plus, Exclusive) అందుబాటులో ఉంటుంది. ఇందులో అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి. 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ ఏసీ వంటి కన్వీనియెన్స్ ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయంలో అడ్వాన్స్‌డ్ క్రూజ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, ADAS టెక్నాలజీ వంటి కీలక ఫీచర్లను కూడా ఇందులో జోడించారు. ఇంజిన్ పర్ఫామెన్స్ విషయానికొస్తే కైట్‌లో 1.6 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్ ఇచ్చారు. ఇది ఇథనాల్‌పై 113 బీహెచ్‌పీ శక్తిని, పెట్రోల్‌పై 110 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్‌యూవీ సిటీలో దాదాపు 11 కి.మీ.ల మైలేజీని ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

Tags:    

Similar News