Nissan : మెర్సిడెస్, బీఎండబ్ల్యూలకు నిస్సాన్ సవాల్.. భారత్‌లోకి లగ్జరీ ఎస్‌యూవీ ఎంట్రీ
భారత్‌లోకి లగ్జరీ ఎస్‌యూవీ ఎంట్రీ
Nissan : భారత ఆటోమొబైల్ రంగంలో తన సత్తా చాటేందుకు జపాన్ దిగ్గజం నిస్సాన్ భారీ వ్యూహంతో ముందుకు వస్తోంది. ఇప్పటివరకు మాగ్నైట్ వంటి బడ్జెట్ కార్లకే పరిమితమైన ఈ కంపెనీ, ఇప్పుడు నేరుగా లగ్జరీ కార్ల దిగ్గజాలైన మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూలకు సవాల్ విసిరేందుకు సిద్ధమైంది. ఈ ప్రణాళికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన లగ్జరీ ఎస్‌యూవీ నిస్సాన్ పాట్రోల్ ను త్వరలోనే భారత గడ్డపైకి తీసుకురానుంది. ఇప్పటికే గ్రావైట్ ఎంపీవీని లాంచ్ చేసిన నిస్సాన్, త్వరలో టెక్టాన్ ఎస్‌యూవీని కూడా మార్కెట్లోకి వదలబోతోంది.
నిస్సాన్ ఇటీవల నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ ఈవెంట్ 2026 విజన్ లో తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించింది. ఈ కార్యక్రమంలో కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ నిస్సాన్ జూక్ ఈవీ, హైబ్రిడ్ ఎస్‌యూవీ నిస్సాన్ ఎక్స్-ట్రైల్ లను ప్రదర్శించింది. ఈ సందర్భంగా నిస్సాన్ ఇండియా ప్రెసిడెంట్ థియరీ సబాగ్ మాట్లాడుతూ.. భారత్‌లో లగ్జరీ కార్లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని తమ ఫ్లాగ్‌షిప్ మోడళ్లను దిగుమతి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
హోమోలోగేషన్-ఫ్రీ ఇంపోర్ట్ అంటే ఏమిటి?
భారతదేశంలోని ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఏ కంపెనీ అయినా ఏడాదికి 2,500 కార్ల వరకు (CBU - పూర్తిగా తయారైన వాహనాలు) ఎటువంటి ప్రత్యేక పరీక్షలు లేదా సర్టిఫికేషన్ అవసరం లేకుండా దిగుమతి చేసుకుని అమ్ముకోవచ్చు. ఈ నిబంధనను వాడుకుని నిస్సాన్ తన పాట్రోల్ ఎస్‌యూవీని భారత్‌లోకి తీసుకురానుంది. దీనివల్ల కారును త్వరగా లాంచ్ చేయడంతో పాటు, గ్లోబల్ స్టాండర్డ్స్‌తో కూడిన లగ్జరీని నేరుగా భారతీయులకు అందించవచ్చు.
ఎందుకు నిస్సాన్ పాట్రోల్ అంత ప్రత్యేకం?
నిస్సాన్ పాట్రోల్ ప్రపంచవ్యాప్తంగా తన అసాధారణమైన ఆఫ్-రోడ్ సామర్థ్యానికి, విలాసవంతమైన ఇంటీరియర్‌కు పేరుగాంచింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇది అత్యంత ఆదరణ పొందిన కారు. అమెరికాలో దీనిని నిస్సాన్ అర్మాడ పేరుతో పిలుస్తారు. ఈ ఎస్‌యూవీ భారత్‌లోకి వస్తే టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ LX, మెర్సిడెస్ GLS, బీఎండబ్ల్యూ X7 వంటి దిగ్గజ కార్లతో నేరుగా తలపడనుంది. శక్తివంతమైన ఇంజిన్, అధునాతన టెక్నాలజీ దీని సొంతం.
భారత్‌లో నిస్సాన్ సరికొత్త అడుగులు
కేవలం లగ్జరీ కార్లే కాకుండా, సామాన్యులకు అందుబాటులో ఉండేలా నిస్సాన్ తన నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. ఇప్పటికే గ్రావైట్ ఎంపీవీ మంచి అమ్మకాలను నమోదు చేస్తోంది. త్వరలో రాబోతున్న టెక్టాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ద్వారా క్రెటా, సెల్టోస్ వంటి కార్లకు పోటీనివ్వాలని నిస్సాన్ భావిస్తోంది. ప్రీమియం బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుకునేందుకు పాట్రోల్ వంటి మోడళ్లను తీసుకురావడం నిస్సాన్ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది.