Nitin Gadkari : పెట్రోల్ తిప్పలు తప్పనున్నాయా? 100% ఇథనాల్‌తో నడిచే వాహనాలపై నితిన్ గడ్కరీ కీలక ప్రకటన
100% ఇథనాల్‌తో నడిచే వాహనాలపై నితిన్ గడ్కరీ కీలక ప్రకటన
Nitin Gadkari : భారతదేశ రహదారుల రూపురేఖలను మార్చేస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, తాజాగా వాహనదారులకు, రైతులకు ఒక అదిరిపోయే గ్రీన్ ఐడియా ఇచ్చారు. ఇకపై మన దేశంలో కార్లు, బైకులు కేవలం పెట్రోల్‌తోనే కాదు, 100 శాతం ఇథనాల్‌తో కూడా పరుగులు తీయాలని ఆయన ఆకాంక్షించారు. దీనివల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా, పెట్రోల్ ధరల భారం నుంచి సామాన్యుడికి విముక్తి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం జరిగిన గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ కాన్క్లేవ్ లో ప్రసంగిస్తూ భారత్ ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రస్తుతం భారత్ తన చమురు అవసరాలలో 87 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. దీనికోసం ప్రతి ఏటా దాదాపు రూ.22 లక్షల కోట్లను వెచ్చిస్తున్నాం. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు ఎప్పుడు ఆటంకం కలుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. అందుకే, మన దేశం ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు వేగంగా అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఇప్పటికే 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) లక్ష్యాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. ప్రస్తుత వాహనాలు చిన్నపాటి మార్పులతో ఈ ఇంధనంపై నడుస్తున్నాయి. అయితే, బ్రెజిల్ వంటి దేశాలు ఇప్పటికే 100% ఇథనాల్‌ను వాడుతున్నాయని, భారత్ కూడా అదే దిశగా ప్రయాణించాలని గడ్కరీ ఆకాంక్షించారు. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని, చెరకు, మొక్కజొన్న వంటి వ్యర్థాల నుంచి ఇంధనాన్ని తయారు చేయడం ద్వారా సర్క్యులర్ ఎకానమీ బలపడుతుందని ఆయన వివరించారు.
భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ప్రధాన ఇంధనంగా మారుతుందని గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుతం దాని ఉత్పత్తి ఖర్చు ఎక్కువగా ఉందని, ఒక కిలో హైడ్రోజన్ ధర ఒక డాలర్‌కు (సుమారు రూ.85) తగ్గినప్పుడు మాత్రమే అది సామాన్యుడికి అందుబాటులోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మున్సిపల్ వ్యర్థాల నుండి హైడ్రోజన్‌ను తయారు చేయడంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. దీనివల్ల నగరాలు శుభ్రపడటమే కాకుండా కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు.
కొంతమంది పెట్రోలియం లాబీయిస్టులు ఇథనాల్ వాడకంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని గడ్కరీ మండిపడ్డారు. ప్రజలు పెట్రోల్, డీజిల్ వాహనాలను కొనకుండా బలవంతం చేయలేమని, కానీ ప్రత్యామ్నాయ ఇంధనాల వల్ల కలిగే లాభాలను వివరించాలని చెప్పారు. ఆటోమొబైల్ కంపెనీలు కేవలం ఖర్చు తగ్గించడంపైనే కాకుండా, నాణ్యమైన ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్ల తయారీపై దృష్టి పెట్టాలని, అప్పుడే ప్రపంచ మార్కెట్లలో భారతీయ వాహనాలకు తిరుగుండదని ఆయన సూచించారు.