Renault Duster 2026 : నెక్స్ట్ జనరేషన్ డస్టర్.. 2026 జనవరి 26న లాంచ్.. డిజైన్, ఫీచర్ల వివరాలు లీక్
డిజైన్, ఫీచర్ల వివరాలు లీక్
Renault Duster 2026 : భారతీయ ఎస్‌యూవీ మార్కెట్‌లో ఒకప్పుడు 4x4 సామర్థ్యంతో సంచలనం సృష్టించిన రెనాల్ట్ డస్టర్ ఇప్పుడు సరికొత్త రూపంలో తిరిగి రాబోతోంది. మూడవ తరం రెనాల్ట్ డస్టర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే భారత రోడ్లపై కనిపించనుంది. ఈ సరికొత్త మోడల్ 2026 జనవరి 26న అధికారికంగా ఆవిష్కరించబడుతుంది. ఆ తర్వాత వెంటనే మార్కెట్లో విడుదల కానుంది. ఈసారి డస్టర్ మళ్లీ బెస్ట్ 4x4 ఎస్‌యూవీగా నిలబడుతుందా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి ప్రత్యర్థులకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.
రాబోయే 2026 రెనాల్ట్ డస్టర్ పూర్తిగా కొత్త డిజైన్ లాంగ్వేజ్‌తో పాటు, మాడ్యులర్ CMF-B ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ కారణంగా ఎస్‌యూవీ మరింత పటిష్టంగా మరియు సురక్షితంగా ఉంటుంది. దీని డిజైన్ గ్లోబల్ మార్కెట్‌లో ఉన్న డాసియా డస్టర్‌ను పోలి ఉంటుంది. కారు ముందు భాగంలో కొత్త రెనాల్ట్ లోగో, ఆకర్షణీయమైన స్పోర్టీ బంపర్‌లు, ప్రత్యేకమైన పాలిగోనల్ హెడ్‌ల్యాంప్‌లు, Y-ఆకారపు LED DRLsతో కూడిన రీడిజైన్ చేయబడిన గ్రిల్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. సైడ్, వెనుక భాగంలో, పెద్ద బాడీ క్లాడింగ్, పవర్ఫుల్ వీల్ ఆర్చులు, రూఫ్ రెయిల్స్, C-పిల్లర్‌పై అమర్చిన రియర్ డోర్ హ్యాండిల్స్, Y-ఆకారపు టెయిల్ ల్యాంప్‌లు, స్పోర్టీ బంపర్‌లు దీని రూపురేఖలను మరింత మెరుగుపరుస్తాయి.
కొత్త 2026 రెనాల్ట్ డస్టర్ ఇంటీరియర్ పాత మోడల్ కంటే చాలా ప్రీమియంగా, మోడ్రన్ గా ఉంటుందని అంచనా. ఇందులో ప్రయాణికులకు అనేక కీలక ఫీచర్లు లభించే అవకాశం ఉంది. వాటిలో ముఖ్యంగా వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, డ్రైవర్‌కు సౌకర్యంగా ఉండే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటివి ఉన్నాయి. సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఈ ఎస్‌యూవీలో ఉండొచ్చు.
భారత మార్కెట్లో కొత్త 2026 రెనాల్ట్ డస్టర్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో రెండు ప్రధాన ఇంజిన్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది.. ఒకటి దాదాపు 1.0 లీటర్, 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, మరొకటి 156 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేసే 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. భవిష్యత్తులో వినియోగదారుల డిమాండ్‌ను బట్టి, రెనాల్ట్ హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా ఈ లైనప్‌లో చేర్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇంధన సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, భారతదేశం కోసం డస్టర్ CNG వెర్షన్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
2026 రెనాల్ట్ డస్టర్ ధర దాని ప్రధాన ప్రత్యర్థులైన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి ఎస్‌యూవీల ధరలకు సమానంగా లేదా వాటికి దగ్గరగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం దీని బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.11 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఉండవచ్చు. అదేవిధంగా టాప్-ఎండ్ ఫీచర్లు ఉన్న పెట్రోల్ వేరియంట్ ధర దాదాపు రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండే అవకాశం ఉంది.