Renault Triber Sales : రెనాల్ట్ ట్రైబర్ సరికొత్త రికార్డు.. 2 లక్షల ఇళ్లలోకి చేరిన మధ్యతరగతి మారాజు

2 లక్షల ఇళ్లలోకి చేరిన మధ్యతరగతి మారాజు

Update: 2026-02-26 10:24 GMT

Renault Triber Sales : మధ్యతరగతి కుటుంబాలకు అత్యంత ఇష్టమైన మల్టీ పర్పస్ వెహికల్ రెనాల్ట్ ట్రైబర్ భారత మార్కెట్లో సరికొత్త మైలురాయిని అధిగమించింది. అతి తక్కువ ధరలో ఏడుగురు ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తున్న ఈ కారు, దేశీయంగా 2 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును దాటేసింది. 2019 ఆగస్టులో లాంచ్ అయినప్పటి నుంచి రెనో కంపెనీకి ఇది వెన్నెముకలా నిలుస్తోంది. కేవలం భారత్‌లోనే కాకుండా విదేశాలకు కూడా ఈ కారు భారీగా ఎగుమతి అవుతోంది.

గణాంకాల ప్రకారం..జనవరి 2026 నాటికి భారత మార్కెట్లో మొత్తం 2,00,253 ట్రైబర్ కార్లు అమ్ముడయ్యాయి. అలాగే 2025 డిసెంబర్ నాటికి సుమారు 34,238 కార్లను రెనాల్ట్ ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. గతంలో విక్రయాలు కొంత తగ్గినప్పటికీ, 2026 ఆర్థిక సంవత్సరంలో ట్రైబర్ మళ్ళీ పుంజుకుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు ఏకంగా 32 శాతం మేర పెరగడం విశేషం. హ్యాచ్‌బ్యాక్ కారు ధరకే ఎస్‌యూవీ లాంటి స్పేస్, 7 సీట్ల సౌకర్యం ఉండటమే దీని సక్సెస్‌కు ప్రధాన కారణం.

ధర విషయానికి వస్తే.. రెనాల్ట్ ట్రైబర్ సామాన్యులకు మరింత చేరువయ్యింది. 2025 సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 నిబంధనల వల్ల ఈ కారు ధర భారీగా తగ్గింది. బేస్ మోడల్ ధరపై సుమారు రూ.54,000 తగ్గడంతో, ఇప్పుడు దీని ప్రారంభ ధర రూ.5.76 లక్షల (ఎక్స్-షోరూమ్) కు చేరుకుంది. మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తున్న ఈ కారు టాప్ మోడల్ ధర రూ.8.39 లక్షల వరకు ఉంది. ఇంత తక్కువ ధరలో 7-సీటర్ కారు లభించడం మార్కెట్లో మరే కంపెనీకీ సాధ్యం కాలేదు.

డిజైన్ పరంగా చూస్తే.. కొత్త ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ చాలా స్టైలిష్‌గా మారింది. ముందు భాగంలో కొత్త లోగోతో కూడిన గ్లోస్ బ్లాక్ గ్రిల్, షార్ప్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, సరికొత్త డీఆర్‌ఎల్‎లు కారుకు ప్రీమియం లుక్ ఇస్తున్నాయి. బంపర్ డిజైన్‌ను కూడా మార్చి, పెద్ద ఎయిర్ డ్యామ్‌ను చేర్చారు. ఫీచర్ల పరంగా కూడా ఎక్కడా తగ్గకుండా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ వంటి ఆధునిక హంగులతో వస్తున్న ఈ కారు, రాబోయే రోజుల్లో ఎంపీవీ సెగ్మెంట్‌లో మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News