Royal Enfield: భారతీయ రక్షణ రంగంతో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు దశాబ్దాల అనుబంధం ఉందనే విషయం మనందరికీ తెలిసిందే. ఆ బంధాన్ని మరింత పటిష్టం చేస్తూ, దేశ రక్షణలో వీరోచిత పోరాటాలు చేసే గోర్ఖా రెజిమెంట్ వీరత్వానికి గుర్తుగా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను కంపెనీ రంగంలోకి దించింది. ఆయో గోర్ఖాలి అనే ప్రసిద్ధ యుద్ద నినాదాన్ని, గోర్ఖా పోరాట పటిమను ప్రతిబింబించేలా ఈ బైక్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సరిహద్దుల్లో పనిచేసే సైనికుల ధైర్యసాహసాలకు గౌరవసూచకంగా దీనిని మార్కెట్‌లోకి తీసుకురావడం విశేషం.

సైనిక వాహనాల రంగుతో అట్రాక్టివ్ డిజైన్

ఈ గోర్ఖా ఎడిషన్‌లో అత్యంత ప్రధానమైన ఆకర్షణ దాని రంగు. మన సైనిక వాహనాల్లో ఉపయోగించే తేలికపాటి ఆలివ్ గ్రీన్ లేదా మిలిటరీ గ్రీన్ కలర్ షేడ్‌తో ఈ బైక్ కస్టమర్లను చూపుతిప్పుకోకుండా చేస్తోంది. ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్‌పై ప్రత్యేకంగా వేసిన గోర్ఖా గ్రాఫిక్స్ దీనికి మరింత గంభీరమైన లుక్‌ను తెచ్చిపెట్టాయి. సైడ్ ప్యానెల్‌పై గోర్ఖా యోధుల సాంప్రదాయ ఆయుధమైన క్రాస్డ్ ఖుక్రీ(రెండు కత్తులు ఉన్న గుర్తు) చిహ్నాన్ని ముద్రించారు. ఈ ఒక్క ఐకానిక్ గుర్తు బైక్ రాయల్ లుక్‌ను ఒక్కసారిగా పెంచేసింది.

అదే పవర్‌ఫుల్ ఇంజిన్.. మెరుగైన ఫీచర్లు

డిజైన్, కలర్ మార్చారే తప్ప ఈ స్పెషల్ ఎడిషన్ మెకానికల్ విభాగంలో కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. రెగ్యులర్ క్లాసిక్ 350లో ఉండే నమ్మకమైన 349 సీసీ సింగిల్-సిలిండర్ జె-సిరీస్ ఇంజిన్‌నే దీనిలోనూ కొనసాగించారు. ఇది 20.2 బిహెచ్‌పి పవర్, 27 ఎన్ఎమ్ టార్క్‌ను సమర్థవంతంగా ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ప్రయాణంలో గరిష్ట భద్రత కోసం ముందు, వెనుక డిస్క్ బ్రేకులతో పాటు డుయల్ ఛానల్ ఏబీఎస్ సదుపాయాన్ని కూడా అందించారు.

షోరూమ్‌లకు చేరిన బైక్స్..వెంటనే డెలివరీలు

ఈ బైక్‌లో అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, యుఎస్‌బి టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్రోమ్ ఎగ్జాస్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. వైర్-స్పోక్ వీల్స్, రౌండ్ మిర్రర్స్ దీనికి పాతకాలపు రెట్రో లుక్‌ను అందిస్తాయి. లాంచ్ సమయానికే ఈ బైక్స్ దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ డీలర్‌షిప్‌లకు చేరుకున్నాయి. కాబట్టి బుకింగ్ చేసుకున్న వెంటనే కస్టమర్లకు వేగంగా డెలివరీలు ఇచ్చేలా కంపెనీ పక్కా ప్లాన్ చేసింది. ధరను కూడా సాధారణ మోడల్‌కు దగ్గరగానే నిర్ణయించే అవకాశం ఉండటంతో ఆర్మీ ప్రేమికులు ఈ కారు కొనేందుకు తీవ్ర ఆసక్తి చూపుతున్నారు.

Tags: