Royal Enfield : బుల్లెట్ బైక్‌లకు భారీ డిమాండ్.. ఉత్పత్తి సామర్థ్యాన్ని 20 లక్షలకు పెంచనున్న రాయల్ ఇన్‌ఫీల్డ్

ఉత్పత్తి సామర్థ్యాన్ని 20 లక్షలకు పెంచనున్న రాయల్ ఇన్‌ఫీల్డ్

Update: 2026-05-25 11:27 GMT

Royal Enfield :భారతీయ ద్విచక్ర వాహన రంగంలో రాయల్ ఇన్‌ఫీల్డ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ బైక్‌ల డిమాండ్ దేశీయ మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ప్రస్తుతం ఉన్న 14లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని ఆర్థిక సంవత్సరం 2028 నాటికి 20లక్షల యూనిట్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా తమిళనాడులోని ప్రస్తుత ప్లాంట్‌ను విస్తరించడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఒక సరికొత్త గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఆర్థిక సంవత్సరం 2026 లో ఈ కంపెనీ ఏకంగా 12.20లక్షల కంటే ఎక్కువ బైక్‌లను విక్రయించి వరుసగా రెండవ ఏడాది కూడా 10లక్షల మార్కును దాటింది.

రూ.958 కోట్ల భారీ పెట్టుబడి

ప్రస్తుతం మార్కెట్లో రాయల్ ఇన్‌ఫీల్డ్ బైక్‌లకు ఎంతటి డిమాండ్ ఉందంటే.. డీలర్ల వద్ద కేవలం 7 నుంచి 8 రోజులకు సరిపడా స్టాక్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సరఫరా కొరతను అధిగమించడానికి కంపెనీ మొదటి దశలో తమిళనాడులోని చెయ్యార్ ప్లాంట్‌లో కొత్త ప్రొడక్షన్ యూనిట్‌ను ప్రారంభించి ఉత్పత్తిని 16లక్షల యూనిట్లకు పెంచుతుంది. ఆ తర్వాత దాదాపు 958 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో మొత్తం ఉత్పత్తి సామర్థ్యాన్ని 20లక్షల యూనిట్లకు తీసుకువెళ్లనున్నట్లు కంపెనీ ఛైర్మన్ సిద్ధార్థ్ లాల్ స్పష్టం చేశారు.

యువత క్రేజ్, అంతర్జాతీయ మార్కెట్

దేశంలో ప్రీమియం బైక్ సెగ్మెంట్ నిరంతరం విస్తరిస్తోందని, ముఖ్యంగా 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువకులు ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ బైక్‌ను కొనుగోలు చేస్తున్నారని కంపెనీ యాజమాన్యం తెలిపింది. విదేశీ మార్కెట్లలో కూడా రాయల్ ఇన్‌ఫీల్డ్ పట్టు బలపడుతోంది. ముఖ్యంగా బ్రెజిల్ దేశంలో ఈ కంపెనీ అమ్మకాలు ఏటా 71 శాతం వృద్ధిని నమోదు చేశాయి. వీటితో పాటు లాటిన్ అమెరికా, దక్షిణ ఆసియా దేశాల్లో కూడా బుల్లెట్ బైక్‌లకు ఆదరణ పెరుగుతోంది.

ఎలక్ట్రిక్ రంగంలోకి అడుగులు

భవిష్యత్తు సాంకేతికతను అందుకునే క్రమంలో రాయల్ ఇన్‌ఫీల్డ్ కంపెనీ ఫ్లయింగ్ ఫ్లీ అనే సరికొత్త బ్రాండ్ పేరుతో ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టింది. రాబోయే రోజుల్లో అన్ని ప్రధాన నగరాల్లో ఈ ఎలక్ట్రిక్ వాహనాలను విస్తరించనున్నారు. అయితే, కస్టమర్లు గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ కంపెనీ 250 సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న బడ్జెట్ బైక్‌ల జోలికి వెళ్లడం లేదు. భవిష్యత్తులో కూడా తమ పూర్తి ఫోకస్ కేవలం 250 సీసీ నుంచి 750 సీసీ మధ్య ఉండే పవర్‌ఫుల్ మిడిల్‌వెయిట్ బైక్‌లపైనే ఉంటుందని కంపెనీ స్పష్టమైన ప్రకటన చేసింది.

Tags:    

Similar News