Royal Enfield Hunter 350 vs Triumph Speed 400: ఏ బైక్ బెస్ట్? ధర, పవర్, ఫీచర్ల మధ్య తేడా ఇదే
ధర, పవర్, ఫీచర్ల మధ్య తేడా ఇదే
Royal Enfield Hunter 350 vs Triumph Speed 400: భారత మార్కెట్‌లో ఇటీవల జీఎస్టీ 2.0 అమలులోకి వచ్చిన తర్వాత బైకుల ధరల్లో పెద్ద మార్పు వచ్చింది. ముఖ్యంగా, 350 సీసీ కంటే తక్కువ ఇంజన్ కెపాసిటీ ఉన్న బైకులపై జీఎస్టీ 28% నుంచి 18% కి తగ్గగా, 350 సీసీ పైన ఉన్న బైకులపై 40% కి పెరిగింది. ఈ మార్పుల కారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350, ట్రయంఫ్ స్పీడ్ 400 ధరల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ రెండు బైకుల్లో ఏది ఎక్కువ మెరుగైనది? ఏ బైక్ కొనుగోలు చేయడం లాభదాయకం? వాటి ధరలు, ఫీచర్లు మరియు పనితీరు మధ్య తేడాలను తెలుసుకుందాం.
జీఎస్టీ 2.0 అమలులోకి వచ్చిన తర్వాత ధరల విషయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కి లాభం జరిగింది. ఎందుకంటే దాని ఇంజన్ కెపాసిటీ 350 సీసీ కంటే తక్కువ. ఈ టాక్స్ కోత కారణంగా హంటర్ 350 ధర రూ. 12,000 నుండి 15,000 వరకు తగ్గింది. దీని ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.38 లక్షల నుండి రూ. 1.67 లక్షల మధ్య ఉంది. ట్రయంఫ్ స్పీడ్ T4 ధర స్వల్పంగా తగ్గి రూ. 1.93 లక్షలుగా ఉంది. ఇది 350 సీసీ కంటే ఎక్కువ కాబట్టి దీనికి ట్యాక్స్ తగ్గలేదు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 నగరంలో సౌకర్యవంతమైన రైడ్ కోసం, దాని స్టైలిష్, క్లాసిక్ డిజైన్ కారణంగా యూత్ లో బాగా పాపులారిటీ పొందింది. ఇందులో 349 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 20.4 హార్స్‌పవర్ పవర్, 27 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేయబడింది. 2025 మోడల్‌లో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, మెరుగైన రేర్ సస్పెన్షన్, స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్లను జోడించారు. అయితే, దీని బేస్ వేరియంట్‌లో అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు లేకపోవడం ఒక చిన్న లోపంగా చెప్పవచ్చు.
ట్రయంఫ్ స్పీడ్ T4 అనేది స్పీడ్ 400 ప్లాట్‌ఫారమ్‌ను పంచుకున్నప్పటికీ, ధరను తగ్గించడానికి కొన్ని మార్పులు చేసిన మోడల్. ఇది ఎక్కువ పవర్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో వస్తుంది. ఇందులో 399 సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది హంటర్ 350 కంటే ఎక్కువ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ధర తగ్గించడం కోసం ఇందులో బయాస్-ప్లై టైర్లను అమర్చారు. ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్‌ను తొలగించారు. అయినప్పటికీ, ఇది తన పవర్, ప్రీమియం ఫీలింగ్‌తో ఆకట్టుకుంటుంది.
ఈ రెండు బైకుల ధరలు, లక్షణాల మధ్య తేడాను బట్టి కొనుగోలుదారుల ఆప్షన్ ఆధారపడి ఉంటుంది. మీరు తక్కువ బడ్జెట్‌లో, ఈజీ మెయింటెనెన్స్ తో సిటీలో సౌకర్యవంతమైన ప్రయాణానికి సరిపోయే బైక్‌ను కోరుకుంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బేస్ వేరియంట్ రూ. 55,000 వరకు చౌకగా ఉండటం వల్ల బెస్ట్ ఆప్షన్.
మీకు మంచి పర్ఫామెన్స్, స్పోర్టీ ఎక్స్ పీరియన్స్, లిక్విడ్-కూలింగ్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు, ప్రీమియం ఫీల్ కావాలంటే, కొంచెం ఎక్కువ ధర అయినా ట్రయంఫ్ స్పీడ్ 400ను ఎంచుకోవడం సరైనది. హంటర్ 350 టాప్ మోడల్‌తో పోలిస్తే కూడా T4 సుమారు రూ. 26,000 మాత్రమే ఎక్కువ.