Skoda Kylaq : ఏడాదిలోనే హాఫ్ సెంచరీ కొట్టిన కైలాక్..ఈ ఎస్‌యూవీ స్పీడుకు రికార్డులు గల్లంతే
ఈ ఎస్‌యూవీ స్పీడుకు రికార్డులు గల్లంతే
Skoda Kylaq : భారతదేశంలో తన ఉనికిని చాటుకుంటూ జర్మన్ ఇంజనీరింగ్ దిగ్గజం స్కోడా 2026 సంవత్సరాన్ని అదిరిపోయే లాంచ్‌తో ప్రారంభించింది. జనవరి నెల విక్రయాల్లో ఏకంగా 39 శాతం వృద్ధిని నమోదు చేసి, ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తోంది. ముఖ్యంగా తన కొత్త సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ కైలాక్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. స్కోడా ఇండియాకు జనవరి 2026 ఒక గుర్తుండిపోయే నెలగా నిలిచింది. మొత్తం 5,739 వాహనాలను విక్రయించిన ఈ సంస్థ, గతేడాదితో పోలిస్తే 39 శాతం వృద్ధిని సాధించింది. ఇందులో ప్రధాన పాత్ర పోషించింది మాత్రం సబ్-4 మీటర్ ఎస్‌యూవీ స్కోడా కైలాక్. ఈ కారు లాంచ్ అయిన ఏడాది లోపే 50,000 యూనిట్ల అమ్మకాల మార్కును దాటేసి తన సత్తా చాటింది. ఈ భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ తాజాగా కైలాక్ లో క్లాసిక్ ప్లస్, ప్రెస్టీజ్ ప్లస్ అనే రెండు కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టింది.
కైలాక్ లో కొత్తగా వచ్చిన క్లాసిక్ ప్లస్ వేరియంట్ మధ్య తరగతి కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు. ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.8.25 లక్షల (మాన్యువల్) నుంచి ప్రారంభం కాగా, ఆటోమేటిక్ వెర్షన్ రూ.9.25 లక్షల వద్ద లభిస్తుంది. ఇక టాప్-ఎండ్ లో వచ్చిన ప్రెస్టీజ్ ప్లస్ వేరియంట్ లో వెంటిలేటెడ్ సీట్లు, పవర్డ్ అడ్జస్టబుల్ సీట్లు వంటి విలాసవంతమైన ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.
జనవరిలోనే స్కోడా తన పాపులర్ ఎస్‌యూవీ కుషాక్ కొత్త వెర్షన్‌ను పరిచయం చేసింది. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో బయటి డిజైన్ తో పాటు లోపల ఇంటీరియర్స్ లో కూడా కొన్ని కీలక మార్పులు చేశారు. ఇప్పటికే ఈ కారు కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి మొదటి వారంలో దీని ధరలను అధికారికంగా ప్రకటించనున్నారు. కుషాక్ తో పాటు సెడాన్ విభాగంలో స్లావియా కూడా జనవరిలో దేశంలోనే నంబర్ 1 ఎగ్జిక్యూటివ్ సెడాన్ గా నిలవడం విశేషం.
స్కోడా ఇండియా ఈ ఏడాది మొత్తం 10 కొత్త లాంచ్‌లు లేదా అప్‌డేట్స్ చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా మూడు గ్లోబల్ మోడళ్లు భారత్ లో అడుగుపెట్టనున్నాయి. వేగంగా వెళ్లాలనుకునే కార్ల ప్రియుల కోసం ఆక్టావియా RS, కోడియాక్ RS వంటి పవర్‌ఫుల్ మోడళ్లను తిరిగి తీసుకురాబోతున్నారు. అలాగే త్వరలోనే స్కోడా సూపర్బ్ 2026, ఎలక్ట్రిక్ విభాగంలో స్కోడా ఎల్రోక్ కూడా భారత్‌కు రానున్నాయి. వీటన్నింటి ద్వారా 2026లో భారత్‌లో తన మార్కెట్ వాటాను మరింత పెంచుకోవాలని స్కోడా భావిస్తోంది.