Skoda Kushaq Facelift : క్రెటా ఆధిపత్యానికి సవాల్..కొత్త కుషాక్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది
కొత్త కుషాక్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది
Skoda Kushaq Facelift : స్కోడా కుషాక్ మోడల్ ప్రస్తుతం కంపెనీ అమ్మకాలలో కీలక వనరుగా ఉంది. సరసమైన ధర, ప్రీమియం ఫీచర్ల కలయికతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. 2021లో మార్కెట్‌లోకి వచ్చిన ఈ కారు, వోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఇండియా 2.0 ప్రాజెక్ట్‌లో ముఖ్యపాత్ర పోషించింది. ఇప్పుడు ఈ విజయాన్ని కొనసాగించడానికి, కంపెనీ కుషాక్ కొత్త, అప్‌డేట్ అయిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ అప్‌డేట్ అయిన ఎస్‌యూవీ జనవరి 2026లో భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది. కొత్త మోడల్‌లో డిజైన్‌లో చిన్నపాటి మార్పులు, ముఖ్యంగా బలమైన ఫీచర్ల జాబితా ఉంటుందని తెలుస్తోంది.
స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ పరంగా చాలా మార్పులకు లోనవుతుంది. బాహ్య రూపకల్పనలో, కొత్త డిజైన్‌తో కూడిన రేడియేటర్ గ్రిల్, అప్‌డేట్ అయిన హెడ్‌ల్యాంప్‌లు,టెయిల్‌లైట్లు ప్రధానంగా కనిపిస్తాయి. అలాగే ముందు,వెనుక భాగంలో కొత్త బంపర్‌లు, అప్‌డేట్ అయిన టెయిల్‌గేట్, కొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్‌ను అందించనున్నారు. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే.. క్యాబిన్‌లో అనేక కొత్త టెక్నాలజీ ఫీచర్లు రానున్నాయి. వీటిలో అత్యంత ముఖ్యమైనదిగా పానరోమిక్ సన్‌రూఫ్ లభించే అవకాశం ఉంది. అదనంగా, అప్‌డేట్ అయిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అధునాతన ఆడియో సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్, వెంటిలేటెడ్ ముందు సీట్లు ఉండవచ్చు.
సేఫ్టీ విషయంలో స్కోడా కుషాక్ ఇప్పటికే 5 స్టార్ రేటింగ్‌ను కలిగి ఉన్నందున, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్‌తో ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి భద్రతా ఫీచర్లు ఎటువంటి మార్పులు లేకుండా కొనసాగుతాయి. ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే, 2026 ఫేస్‌లిఫ్ట్‌లో పాత మోడల్‌లో ఉన్న 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌లే కొనసాగే అవకాశం ఉంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 7-స్పీడ్ డీసీటీ (DCT) ఆటోమేటిక్ యూనిట్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ అప్‌డేట్‌లు ముఖ్యంగా పానరోమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్ల జోడింపుతో, స్కోడా కుషాక్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో ఉన్న హ్యుందాయ్ క్రెటా ఆధిపత్యాన్ని గట్టిగా సవాలు చేయనుంది.